Vennela Waterfalls: వెన్నెల జలపాతం వద్ద పర్యాటకుల సందడి..

Vennela Waterfalls: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అర్బన్ పార్క్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్లగానే అబ్బురపరిచేలా విశేషంగా ఆకట్టుకుంటున్న జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తుంది. రథం గుట్టపై గలగల పారే శబ్దాల సవ్వడితో జాలువారుతుంది ఈ వెన్నెల జలపాతం.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లాపాపలతో సేదతీరేందుకు వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా సమీపంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ నుంచి పర్యాటకులు వచ్చి వీక్షిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది.
రోడ్డు సౌకర్యం లేకపోవడం మట్టి రోడ్ కావడం వల్ల బురదమయం కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మొత్తం చిత్తడిగా ఉండడంతో పిల్లలతో రావడానికి ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి పెట్టి రహదారి, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



