ఆంధ్ర ప్రదేశ్

YCP: అద్దంకిలో పడిపోతున్న వైసీపీ గ్రాఫ్

YCP: ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. ఉన్న ఇంచార్జ్ పత్తా లేకుండా పోవడంతో వైసీపీ క్యాడర్‌లో గందరగోళం నెలకొందట. అధికారం ఉన్నప్పుడు గన్‌మెన్‌లతో హంగామా చేసిన ఆ నేత పార్టీ కష్టకాలంలో ఉంటే పట్టించుకోకుండా పోయారట. పార్టీ పిలుపునిచ్చిన సమయాల్లో మొక్కుబడిగా వస్తున్న ఆయన ఆ వెంటనే వచ్చిన దారిన తుర్రుమంటున్నారట. దీంతో ఈ ఇంచార్జ్ మాకొద్దు బాబోయ్ అంటూ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది..? కనబడకుండాపోయిన ఆ నేత ఎవరు..?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో వైసీపీ గ్రాఫ్ నానాటికి పడిపోతోందట. 2014లో మొదటిసారి ఇక్కడ జెండా ఎగిరేసిన వైసీపీ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. 2014లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుతం మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కొంతకాలానికే ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో 2019లో మాజీ ఎమ్మెల్యే గరటయ్యను వైసీపీ రంగంలోకి దించింది. అయితే ఆయన కూడా ఓటమి పాలయ్యారు. దీంతో 2024లో బిజినెస్ మ్యాన్‌గా పేరున్న పాణెం హనిమిరెడ్డిని బరిలోకి దించింది. అయితే పరిస్ధితిలో మాత్రం మార్పు కనబడలేదు.

మళ్లీ గొట్టిపాటే విజయం సాధించి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ ఇంచార్జ్‌గా వచ్చిన హనిమిరెడ్డి అప్పట్లో చేసిన హాడావుడి అంతా ఇంతా కాదట. నా ముందు గొట్టిపాటి పూచిక పుల్ల అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికిన సందర్భాలు ఉన్నాయట. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసి జగన్‌కు గిఫ్టుగా ఇస్తానని బహిరంగంగా ప్రామిస్‌లు కూడా చేశారట. అయితే.. ఆయనకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిందట.

ఓటమి తర్వాత అద్దంకి వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న హనిమిరెడ్డి కనబడటమే మానేశాడట. పార్టీ కార్యక్రమాలకు కూడా తప్పని సరి అయితేనే వస్తున్నారట. లేకుంటే నియోజకవర్గం ముఖం కూడా చూస్తున్న ధాఖలాలు లేవట. చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చే హనిమిరెడ్డి కార్యకర్తలను కలవడమే మానేశాడట. అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీలోఇదే పరిస్ధితి కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే గుసగుస లాడుకుంటున్నారట.

మరోవైపు ఎన్నికల సమయంలో అద్దంకి టికెట్ కోసం గరటయ్య కుమారుడు విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారట. హనిమిరెడ్డికి అద్దంకి టికెట్ ఇప్పించింది కూడా సబ్బారెడ్డేనట. అయితే దీనివెనుక పెద్ద కథే నడించిందని టాక్ వినిపిస్తోంది. హనిమిరెడ్డిని ఇక్కడకు తేవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయట.

నిజానికి వైవీ సుబ్బారెడ్డి అద్దంకి నుండి వాళ్ల కుమారుడిని పోటీ చేయాంచాలనుకున్నారట. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న గొట్టిపాటిని ఢీకొట్టడం అంటే సామాన్య విషయం కాదని భావించారట. అందుకే ఎవరైనా ఒకరిని పోటీలో ఉంచి అతన్ని గొట్టిపాటి పైన బరిలో నిలపాలనుకున్నారట. అయితే గరటయ్య కుటుంబానికి టికెట్ కేటాయిస్తే అతను గెలిస్తే పాతుకుపోతాడనే భయం వైవీలో ఉందట. అందుకే వ్యాపారాల్లో పార్టనర్‌గా ఉన్న హనిమిరెడ్డిని రంగంలోకి దింపారట. అయితే ఇవేమీ తెలియని హనిమిరెడ్డి.. పాపం ఎన్నికల్లో పోటీ చేసి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారట.

ఒకవేళ హనిమిరెడ్డి గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి అద్దంకి సీటును తన కొడుక్కు ఇప్పించుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి ఆలోచన చేశారట. గొట్టిపాటిని ఒకసారి ఓడిస్తే తర్వాత ఈజీగా మళ్లీ గెలవచ్చనే భావన వైవీలో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే హనిమిరెడ్డిని వైవీ ఒక ఎరలా వాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పాపం వైవీ రాజకీయాలకు హనిమిరెడ్డి ఆటలో అరటి పండులా బలైపోయాడని స్ధానిక ప్రజలు చెప్పుకుంటున్నారట.

మరోవైపు ఎన్నికల్లో ఓటమి తర్వాత హనిమిరెడ్డి కనబడకపోవడంతో అద్దంకిలో ఇంచార్జ్‌ను మార్చాలని వైసీపీ అధిష్టానం కూడా భావిస్తోందట. ప్రస్తుతం చీరాల ఇంచార్జ్‌గా ఉన్న కరణం ఫ్యామిలీకి అద్దంకి భాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుందని జగన్ ఆలోచన చేస్తున్నారట. గొట్టిపాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే అది కరణం కుటుంబం తప్ప మిగిలిన వారి వల్ల కాదని స్ధానిక వైసీపీ నేతలు అధిష్టానం వద్దకు తీసుకెళ్లారట.

కరణం కుటుంబానికి ఇప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో సపరేటు వర్గం ఉంది. కరణం వాళ్లు కూడా తన వర్గం వారితో ఎప్పుడు టచ్‌లోనే ఉంటారట. కరణం అద్దంకిలో అడుగు పెడితే స్ధానికంగా వైసీపీకి కొంత కలిసొచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతల నుండి వినిపిస్తోంది.

గొట్టిపాటిని ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదనే విషయం కరణం కుటుంబానికి తెలుసు. ఈ క్రమంలో కరణం.. అద్దంకి ఇంచార్జ్ భాద్యతలు చేపడితే స్ధానికంగా ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మరోసారి రాష్ట్రస్దాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి వైసీపీ చీఫ్ జగన్.. కరణాన్ని అద్దంకికి పంపుతారా లేదా అనేది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button