Indian Citizenship: ఐదేళ్లలో 9 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు

Indian Citizenship: గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదిలేశారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇది ఒక దేశం లోపల పెరుగుతున్న అనిశ్చితి, ఆశలు నెరవేరకపోవడం, అవకాశాల కోసం జరిగే తపన, ప్రపంచవ్యాప్తంగా జరిగే టాలెంట్ మోబిలిటీ మధ్యన ఉన్న వాస్తవం.
భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినా, యువతకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల నాణ్యత మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఉన్నత విద్యతో వచ్చిన ప్రతిభకు గ్లోబల్ కంపెనీలే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయ్. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో స్థిరమైన జీతాలు, ప్రమోషన్ స్ట్రక్చర్స్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలతో భారత యువతను ఆకర్షిస్తున్నాయి.
దేశీయంగా రాజకీయాలు, పట్టణాల్లో పెరుగుతున్న రద్దీ, కాలుష్యం, ఆరోగ్య సమస్యలున్నీ కూడా ఎగువ మధ్యతరగతి, సంపన్నులను ఎక్కువగా బయట దేశాలకు వెళ్ళడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. స్కూళ్లు, హాస్పిటళ్లు, పబ్లిక్ సర్వీసుల్లో ఉన్న తేడా విదేశాలకు వెళ్లేందుకు కారణమన్న వర్షన్ విన్పిస్తోంది.
వేతనం పెరుగుతున్నంతగా పన్నుల భారమూ పెరుగుతోండటం, పెన్షన్ భద్రత లేకపోవడం మిడిల్ క్లాస్‌ను విదేశాల్లో ఆర్థిక భద్రత కోసం వెతికేలా చేస్తోందన్న అభిప్రాయం ఉంది. దేశంలో పెట్టుబడి వాతావరణం మెరుగుపడుతున్నా, జీవితం ఖరీదవుతూ ఉండటం కూడా ఒక కారణమన్న భావన ఉంది. కొంతమంది భారతీయులకు రాజకీయ వైఖరి, స్వేచ్ఛల భద్రత, వ్యక్తిగత హక్కులు, మైనార్టీల భద్రత వంటి అంశాలపై భయాలు కూడా కారణమన్న ఫీలింగ్ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో, సేఫ్ అండ్ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ కోసం కొందరు కొత్త దేశాలను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం భారతదేశ సమస్య కాదు. ప్రపంచం ఇప్పుడు టాలెంట్ కోసం యుద్ధం చేస్తోంది. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే ఇవి పర్మినెంట్ రెసిడెన్సీకి డోర్లు తెరుస్తున్నాయి. అమెరికాలో ఇబ్బందులున్నప్పటికీ పలు దేశాలు టాలెంట్‌ను రారమ్మని స్వాగతం పలుకుతున్నాయి. అవసరం, కోరికలు, అవకాశాలు మూడూ కలిసి నైపుణ్యంగల భారతీయులను ఆహ్వానిస్తున్నాయి.
విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది నిర్మాణం, శ్రమాధారిత ఉద్యోగాలు చేసే వలస కార్మికులున్నట్టుగా కూడా తేలింది. సౌదీ, UAE, మలేషియా వంటి దేశాల్లో భారతీయులు సమస్యలు, మోసాలు, యజమానుల దుర్వినియోగం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయినా, కుటుంబ భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లడాన్ని కొందరు ఆపడం లేదు. ఐతే దేశం వదలి వెళ్లేవారు దేశాన్ని ద్వేషించి వెళ్లడం కాదు. చాలామందికి ఇది ఒక ఎకనామిక్ డెసిషన్, ఎవరికి ఇది ఒక కెరీర్ మార్పు, కొంతమందికి ఇది పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న త్యాగంగా ఉంది. ఈ నెంబర్లు భారతదేశానికి కొత్త సవాలు విసురుతున్నాయి.
ప్రతిభను సృష్టిస్తున్న దేశం ఆ ప్రతిభను నిలబెట్టుకోగలుగుతున్నదా? కొత్త అవకాశాల కోసం బయలుదేరే భారతీయులు ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు, అత్యంత విజయవంతులు. కానీ ఒక రోజు—ఈ టాలెంట్ తిరిగి దేశానికి వచ్చి, భారత శక్తిని గ్లోబల్ స్థాయిలో పెంచే రోజులు రావాలంటే దేశం వారికి కావాల్సిన స్థిరత్వం, అవకాశాలు, భద్రత ఇవ్వాలి.



