వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ క్లాసులు

Intermediate classes: వేసవి సెలవులలో తరగతులు నిర్వహించరాదనే ప్రభుత్వ నిబంధనలను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.
జూన్ 2న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని, అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు తప్పనిసరి సెలవుల షెడ్యూల్‌ను పాటించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో అనధికారకంగా తరగతులు నిర్వహిస్తే ఆ విద్యా సంస్థల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అయినా ఇవేమీ పట్టించుకోకుండా మియాపూర్ లో ఉన్న ఎలెన్ కాలేజీలో గత మూడు రోజులుగా సమ్మర్ క్లాసులు ప్రారంభించారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతున్న ఈ తరగతులు సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. గేట్లకు తాళాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్టీవీఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ ఎలెన్ కాలేజీని ముట్టడించారు. ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి క్లాసులు ఎలా నిర్వహిస్తున్నారని వారు ప్రశ్నించారు.
అయితే దీనిపై ఎలెన్ కాలేజీ నిర్వాహకులు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఓసారి ఎలెన్ అనేది కోచింగ్ సెంటర్ అని, మరోసారి కాలేజీ అని చెప్పడంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు తమకు అనుమతులు ఇచ్చిందని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుంది. వేసవి తరగతులకు పర్మిషన్ ఉందా అంటే లేవని తెలిపారు. దీంతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎలెన్ కాలేజీ ఎదుట భైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులను వెంటనే ఇక్కడి నుండి పంపించేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఎలెన్ కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థులను బయటకు పంపకుండా క్లాసులు నిర్వహించేందుకు ప్రయత్నించింది. ఒక్కో విద్యార్థి నుండి 40 వేలతో 30వేల మంది విద్యార్థులను జాయిన్ చేసుకున్నారు.