ఆడపులికి క్లీంకార పేరు.. హైదరాబాద్ జూకు థాంక్స్ చెప్పిన ఉపాసన

హైదరాబాద్ నెహ్రూ జూలో ఓ ఆడపులికి క్లీంకార అని నామకరణం చేశారు. ఉపాసన, తన కూతురితో కలిసి జూని సందర్శించి, పులిని దత్తత తీసుకున్నారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఓ ఆడపులికి ‘క్లీంకార’ అని పేరు పెట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రామ్చరణ్ సతీమణి ఉపాసన, తన కూతురు క్లీంకారతో కలిసి జూని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ చురుకైన ఆడపులిని దత్తత తీసుకుని, దాని సంరక్షణ కోసం నిధులను జూ డైరెక్టర్ డా. సునీల్ హిరేమత్కు అందజేశారు.
గత ఏడాది చిన్న పిల్లగా ఉన్న ఈ పులి, ఇప్పుడు ఉల్లాసమైన ఆడపులిగా మారిందని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, “వన్యప్రాణుల సంరక్షణకు మద్దతిచ్చే జూ బృందానికి కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. క్లీంకారతో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఉపాసన చొరవకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల పరిరక్షణలో ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.