అంతర్జాతీయం

Donald Trump: అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు.. సంచలనంగా మారుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ చేసిన సంతకాలు చూస్తే.. మిగతా దేశాలకు గుండె దడ మొదలైంది. అమెరికాలో పుట్టే అందరికీ పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. జన్మతః పౌరసత్వం విధానం రద్దు చేస్తూ ట్రంప్‌ తీసుకొన్న నిర్ణయం కాకరేపుతోంది. ఈ నిర్ణయం ప్రవాస భారతీయులపై ప్రభావం చూపనుందా..? చట్ట సవరణ సాధ్యమేనా..?

అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకొచ్చారు. అతని నిర్ణయాలు ప్రపంచంపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని.. ట్రంప్ రద్దు చేశారు. దాదాపు వందేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా.. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో 14వ రాజ్యాంగ సవరణ చేసింది. దీని ద్వారా.. శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే.. తాజాగా ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో దీనికి బ్రేక్‌ పడింది.

అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024 చివరినాటికి అమెరికాలో 54 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అమెరికా జనాభాలో ఇది 1.47 శాతం. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు. మిగతావారంతా వలసదారులు. ఈ క్రమంలో ట్రంప్‌ తీసుకొన్న తాజా నిర్ణయం.. ఎన్నారైలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హెచ్‌1బీ వంటి తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి.. గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వారికి పుట్టిన సంతానానికి ఇప్పటిమాదిరిగా అమెరికా పౌరసత్వం ఇకపై లభించబోదు.

అమెరికాలో ఇండియన్ పేరెంట్స్‌కు పుట్టిన పిల్లలకు ఇప్పటిలా అక్కడి జన్మతః పౌరసత్వం లభించదు. గ్రీన్‌కార్డు కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూస్తున్న భారతీయ వలసదారులకు.. తాజా నిర్ణయం మరో ఆటంకంగా మారనున్నది. అమెరికాలో పుట్టినప్పటికీ.. తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం రాకపోవడంతో.. గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది.

అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇప్పటివరకూ జన్మతః పౌరసత్వం లభించడంతో.. వారికి 21 ఏండ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను.. అమెరికాకు తీసుకొచ్చేవారు. అయితే.. తాజా ఉత్తర్వులతో ఇకపై వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల తల్లిదండ్రులు భారత్‌లో, పిల్లలు అమెరికాలో ఉండాల్సి వస్తుంది.

నాన్‌ ఇమ్మింగ్రెట్‌ వీసాపై అమెరికా వెళ్లిన వారికి జన్మించిన పిల్లలకు.. అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యం. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జన్మతః పౌరసత్వాన్ని నిలిపివేస్తే.. దాని ప్రభావం దాదాపు అందరిపైనా పడుతుంది. అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారే అని నిరూపించుకోవాల్సి వస్తుంది.

ఈ విధానాన్ని రద్దు చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చడం చాలా సుదీర్ఘ ప్రక్రియ.. అంతేకాకుండా సవాళ్లతో కూడుకున్నది. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్‌, సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది దానిని ఆమోదించాలి.

కొత్త సెనేట్‌లో డెమొక్రాట్‌లకు 47 స్థానాలు ఉండగా.. రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. మరోవైపు హౌస్‌లో డెమొక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button