Chandrababu: పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం

Chandrababu: పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు.
సచివాలయంలో పూర్వోదయ, సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రకాశం సహా, రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా 40 వేల కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20 వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు.
ఇందులో 5 వేల కోట్లతో ప్రత్యేకం గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అలాగే, ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువులను పూర్తి చేయటం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.
58వేల 700 కోట్లతో పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపైనా చర్చించారు. దీంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు అన్నారు. మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. అలాగే పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందన్నారు.
ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్‌లకు అలాగే, నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే యోచన చేయాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.
ఉత్తరాంధ్రలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి ఇందుకోసం 5 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఆయిల్ పామ్‌కు, ఇతర ఉద్యాన పంటలకు అనుకూలమని ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ జిల్లాల్లో నేచురల్, ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. 169 కోట్లతో వంశధార-నాగావళి, చంపావతి నదుల అనుసంధానం చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టంచేశారు.



