ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

Tirumala: ఉత్సవ ప్రియుడు, భక్త వత్సలుడు, కలియుగ రక్షడుకు శ్రీ శ్రీ వేంకటేశ్వరుడికి ఏడాదికి ఒకమారు నిర్వహించే ఆనందోత్సవంకు తిరుగిరులు ముసత్తబు అవుతున్నాయి. దేవుడే ఆలయం నుంచి వెలుపలకు వచ్చి భక్తులకు తనివితీరా దర్శన భాగ్యం కల్పించే అపురూపమైన ఉత్సవాలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమలగిరి రాయుడికి బ్రహ్మ చేసిన ఘనోత్సవాలు. అసలు బ్రహ్మోత్సవాల అంతరార్థం ఏమిటి..? బ్రహ్మోత్సవంలో దాగి ఉన్న దైవ రహస్యం ఏమిటి..? భక్తజన కోటికి తిరుమలలో ప్రతి రోజు బ్రహోత్సవాలే అయినప్పుడు.. ఈ ఉత్సవాల నిర్వహణ వెనక ఉన్న విశిష్టత ఏంటి..?

కలియుగ వైకుంఠంగా… ఓ దివ్యక్షేత్రంగా.. పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగ యుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు. శ్రీనివాసుడు, తిరుమలేశుడు, ఆపదమొక్కులవాడు సప్తగిరీశుడు, గోవిందుడు ఇలా అనంతమైన పేర్లతో పిలిచే స్వామి భక్తుల పాలిట కల్పతరువు. పట్టిన వారి చేత బంగారం. సేవ చేసిన వారి చేతిలో మాణిక్యం. భావించువారి పరబ్రహ్మ.

పూజించేవారిని రక్షించే వజ్రాయుధం. అందుకే తిరుమలేశుని కోవెలె నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా నిలుస్తుంది. రోజుకు దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది తిరుమలే. సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది. దేశం నలుమూలలనుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాస సందర్శన కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు.

గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని అరవింద దళాక్షుడిని ఆర్తితీరా దర్శించుకుంటారు. సాధారణ భక్తులే కాదు సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ వేత్తలు క్యూలు కట్టే క్షేత్రం ఏదంటే అది తిరుమలే.అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ జన సంద్రమే.

శ్రీవారి దర్శనానికి వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారు వెళుతుంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనంతో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. మరికొందరు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్రకళాశాభిషేకం, తోమాల, అర్చనం, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కొక్క సేవలోనూ ఒక్కో దివ్యానుభూతి పొందడం జరుగుతుంది. అందుకే వచ్చినవారే మళ్లీ మళ్లీ వస్తారు. చూసిన కనులే మళ్లీ మళ్లీ ఆ దేవదేవుని దర్శించుకుంటాయ్. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్ని సార్లు దర్శించినా తనివితీరదు.

ప్రపంచంలోనే పేరొందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలకు యుగయుగాల చరిత్ర ఉంది. శ్రీ వైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి భూలోకం వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్టువే శ్రీవేంకటేశ్వరుడు. భూభారాన్ని వహించడానికి వరాహస్వామి రూపుదాల్చిన శ్రీమహావిష్ణువు ఈ క్షేత్రం పైనే సేదతీరారు. లక్ష్మీదేవితో కలహించి వేంకటాద్రికి చేరడం ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని పెళ్లాడడం తిరుమల శిఖరానికి చేరుకుని శిలారూపంగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయ్. కలియుగారంభం నుంచి అర్చామూర్తిగా భక్తులచేత పూజలందుకుంటున్నాడు.

అందుకే తిరుమల కలియుగ వైకుంఠంగా జగత్ ప్రసిద్ధమైంది. స్వయం వ్యక్తమై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అనాదిగా వైఖానసాగమ ప్రకారం పూజా నివేదనలు జరుగుతున్నాయ్. శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడ ధ్రువమూర్తిగా, కౌతుకమూర్తి, స్నపనమూర్తి, కొలువుమూర్తి, ఉత్సవమూర్తులుగా ఐదు రూపాల్లోనూ భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. ఊరేగింపులు, సేవలు, వేడుకలు చేయించుకుంటూ.. కలౌ వేంకటనాయకః భక్తుల హృదయాల్లో కొలువుదీరాడు తిరుమలేశుడు.

వేద కాలం నుంచి తిరుమల పవిత్ర పుణ్యధామంగా భాసిల్లుతోంది. స్వామి పుష్కరిణితో పాటు ఆకాశ గంగ పాపనాశనం ఇంకా అనేకానేక తీర్ధాలు తిరుమల గిరులను పునీతం చేస్తున్నాయ్. యుగాలు మారుతున్నా తిరుమల ప్రాశస్త్యం ఏడుకొండలవాడి వైభవం ఇంతింతై వటుడింతై అన్నచందాన పెరుగుతుందే కానీ తరగట్లేదు. అందుకు నిదర్శనమే నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతి రోజూ పండగే ప్రతి రోజూ ఉత్సవమే. ఏడాది పొడవునా దాదాపుగా 450 ఉత్సవాలు జరుగుతాయ్. ఏడాది పొడువునా ఏడుకొండలవాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు.

తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటీ ఉవ్విళ్లూరుతుంది. స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మత్సవాలనీ వైభవంగా జరిగే వేడుకులు కావున బ్రహ్మోత్సవాలని పేరొందినట్లు పురాణాలు చెబుతున్నాయ్. ఆశ్వయుజ మాసంలోని స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా తిరుమల కొండలపై జరుగుతాయ్.

ప్రతి మూడవ ఏటా అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మత్సవాలు బాద్రపద మాసంలోఒకటి. దసర నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతుంటుంది. అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయ్. యుగయుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

చక్రవర్తులు, మహరాజులు తమ విజయపరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు. నెలకొకటి చొప్పున ప్రతి ఏటా 12 బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. క్రీశకం 614లో పల్లవరాణి సమవాయ్ మనవాళ పెరుమాళ్ అనే మహిళ వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహుకరించింది. పెరటాసి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు.

ఆ తరువాత క్రీశకం 1254 చైత్ర మాసంలో తెలుగు పల్లవరాజు విజయ గండ గోపాలదేవుడు, క్రీశకం 1328 ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువేంకట యాదవ రాయలు, క్రీశకం 1429 ఆశ్వయుజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు, క్రీశకం 1446లో మాసి తిరునాళ్ల పేరుత హరిహరిరాయలు, క్రీశకం 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు… ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది.

క్రీశ 10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు. క్రీశకం 1339 నుంచి మలయప్ప కోనలో లభించిన మలయప్ప స్వామిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి నిత్య కల్యాణోత్సవాలు, ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో రాజులు, చక్రవర్తులు స్వామికి ధనధాన్యాలు, అగ్రహారాలు, దివ్యాభరణాలు కానుకగా సమర్పించేవారు.

ఇక 14వ శాతబ్దం వరకూ శ్రీ వేంకటేశ్వరస్వామికి రెండు బ్రహ్మోత్సవాలు జరిగేవి. 15వ శతాబ్దంలో ఏకంగా సంవత్సరంలో ఏడు బ్రహ్మోత్సవాలు కూడా స్వామికి అప్పటి రాజులు నిర్వహించారు. అన్నమాచార్యుల కుమారుడు తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు రెండు వేల వరహాలను శ్రీవారి భాండాగారముకు సమర్పించి 13 రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఇంకా దేవరాయ మహరాయలు అల్పిశి బ్రహ్మోత్సవం, బుక్కరాయ మహారాయలు కార్తికి బ్రహ్మోత్సవం, కృష్ణ దేవ మహరాయలు తల్లిదండ్రుల పేరుతో తై బ్రహ్మోత్సవం, హరిహరరాయ మహరాయలు మాసి బ్రహ్మోత్సవం, వీరనరసింగ యాదవ రాయలు పుంగుణి బ్రహ్మోత్సవం, తాళ్లపాక తిరుమలాచార్యులు ఆని బ్రహ్మోత్సవం ఇలా వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ విధంగా క్రీశకం 16వ శతాబ్దంలో శ్రీనివాసునికి తొమ్మిది నెలల్లో పది బ్రహ్మత్సవాలు 9 రోజుల పాటు, 11 రోజుల పాటు, 13 రోజుల పాటు జరుగుతుండేవని చరిత్ర చెబుతోంది. రాయల వారి కాలంలో ప్రతి ఏటా 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయ్.

వెంకన్నకు మాన్యాలు సమర్పించి దాతలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారట. ఇక రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలసిపోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తరువాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్కల్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ కొండల రాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటుతున్నాయ్. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం.. మహద్భాగ్యంతో భక్తులు భావిస్తారు. థ్వజారోహణతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు పరిసమాప్తమౌతాయ్.

విశిష్ట ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాలకు ముందు రోజున వచ్చే మంగళవారం నాడు అర్చకులు అధికారులు సంయుక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోనే ఉత్సవ శోభ మొదలైతుంది. ఆ తరువాత శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా పరిమళ భరిత పుష్పాలతోనూ విద్యుద్దీపాలతోనూ పూల పందిళ్లతోనూ అందంగా అలంకరిస్తారు. థ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకారార్పణ జరుగుతుంది. థ్వజారోహణం నాడు శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి సమక్షంలో వేదమంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుఢ థ్వజాన్ని ఎగురవేస్తారు.

బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే ఈ కార్యక్రమం వేడుకగా నిర్వహించిన తరువాత ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమౌతాయ్. రోజూ ఉదయం, రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లతో కలసి… వివిధ వాహనాలపై ఊరేగే ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటీ తిరుమలకు పోటెత్తుతుంది. పరిమళ భరిత పూమాలల నడుమ దివ్యాభరణాలను ధరించి స్వామి దేవేరులతో కలసి తిరుమాఢ వీధుల్లో సాగించే వాహన విహార వైభోగం .చూసిన వారికి చూసినంత.

పెద శేషవాహనం, చిన శేషవాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, గరుఢ వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, అశ్వ వాహనాల పై 9 నాళ్లూ ఉరేగి భక్తులకు కనువిందు కలిగిస్తాడు ఆ కోనేటి రాయుడు. మోహినీ అవతారంలో మురిపించి ధగధగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ.చక్కరధం పై భక్తులను కఠాక్షిస్తూ స్వామి మాఢ వీధుల్లో ఊరేగి అభయ ప్రదానం చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి వాహనం గరుత్మంతుడు. ఉత్సవాల్లో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకుని సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయ్. గోవిందనామస్మరణలతో ఏడుకొండలు మారుమ్రోగతాయ్.

కొండంత దేవుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. రోజుకొక్క వాహనంతో రోజుకొక్క అలంకరణలతో శ్రీవారి వాహన సేవలు ఆద్యంతం.. ఆనందమయంగా సాగుతాయ్. ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్రస్నాన కార్యక్రమమూ వేడుకగా జరుగుతుంది. భక్తులు కూడా పుష్కరిణిలో పుణ్య స్నానాలాచరించి దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే థ్వజ అవరోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమౌతాయ్.

కలియుగ వైకుంఠాన 9 రోజుల ఉత్సవాలను కళ్లారా తిలకించి తరించి ఆ దేవ దేవుని దివ్యమంగళ స్వరూపాన్ని మదిలో భద్రంగా దాచుకుని పునర్దర్శనాన్ని కోరుతూ భక్తులు తిరుమల యాత్రను ముగిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button