దేశంలోని ప్రతి మూలకు ఇంటర్నెట్ అందించే కసరత్తు

భారతదేశంలో ఉపగ్రహ ఆధారిత చివరి మైలు కనెక్టివిటీని వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలపై చర్చించేందుకు, స్పేస్‌ఎక్స్–స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్, వారి సీనియర్ బృందాన్ని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్లు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా కలిశారు. ఈ విషయాన్ని ఎలన్ మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మస్క్ టీమ్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. డిజిటల్‌గా సాధికారతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి దార్శనికత సాధించేందుకు స్పేస్ ఎక్స్-స్టార్ లింక్ సహకారం తీసుకుంటామని జ్యోతిరాధిత్య ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని మారుమూల గ్రామాలు, ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను వేగంగా అందించడంతోపాటుగా, కష్టమైన ప్రదేశాలు కూడా వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందేందుకు ఉపగ్రహ సాంకేతికత సహకరిస్తోందని ఆయన చెప్పారు.
దేశంలోని చిట్ట చివరి ప్రజకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేర్చడం, ప్రతి పౌరుడుని డిజిటల్ ప్రపంచంలో భాగస్వామిగా చేయొచ్చని తమకు నమ్మకం కలుగుతోందని మంత్రి చెప్పారు. మొత్తంగా భారత డిజిటల్ భవిష్యత్తును వేగవంతం చేసే కీలక పరిణామంగా, స్పేస్‌ఎక్స్–స్టార్లింక్ -కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని చెప్పవచ్చు. దేశంలోని మారుమూల ప్రాంతాల వరకు ఉపగ్రహ ఆధారిత చివరి మైలు కనెక్టివిటీ విస్తరణపై జరిగిన ఈ చర్చలను ఎలన్ మస్క్ స్వయంగా వెల్లడించడం, వచ్చే రోజుల్లో ఏం జరగబోతుందన్నదానిపై క్లారిటీ తెస్తోంది.



