Hyderabad Metro: రూ.19 వేల కోట్లతో మెట్రో రెండోదశ మలిభాగం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులో రెండోదశలో చేపట్టే మలివిడత కారిడార్‌ను ఖరారు చేశారు. 19 వేల కోట్ల అంచనాలతో ఈ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నారు. మెట్రో రెండో దశ చివరి విడత ప్రాజెక్టులో భాగంగా మూడు రూట్లలో 86.5 కి.మీ దూరంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 1. జేబీఎస్-మేడ్చల్, 2.జేబీఎస్-శామీర్‌పేట, 3. శంషాబాద్ ఎయిర్పోర్ట్ -ప్యూచర్ సిటీ మార్గాలు ఉంటాయి.
మూడు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు తెలిపింది. తాజాగా డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. మంత్రివర్గంలో ఆమోదించిన తర్వాత కేంద్రప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మలిదశ నిర్మాణంలో ఎక్కడా డబుల్ డెక్ రూట్లను ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్-శామీర్‌పేట, జేబీఎస్-మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ విధానంలో మెట్రో పిల్లర్లు వేయాలని భావించారు. ఈ విధానంలో ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించినా స్టేషన్లు బాగా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఎఎంఎల్ దానికి అంగీకరించలేదు.
జేబీఎస్ నుంచి కార్ఖానా, అల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్‌పేట వరకు 22 కి. మీ. మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ రన్‌వే రహదారి పక్కనే ఉండటంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. హకీంపేట ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సుమారు కిలోమీటరున్నర దూరం భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్‌వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు.
జేబీఎస్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వెళ్లేందుకు 24.5 కి.మీ. మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతోపాటు శామీర్‌పేట్ వైపు మెట్రో ట్రాక్‌లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో నిర్మిస్తారు. మెట్రో తాజా కారిడార్లలో నిర్మించే మూడు మార్గాలకు కూడలిగా జేబీఎస్‌ను అభివృద్ధి చేసేలా ఎలైన్ మెంట్ ఖరారు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్యూచర్‌సిటీ వరకు 40 కి.మీ. మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టర్మినల్ స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తారు. మెట్రో ప్రాజెక్టు రెండోదశలో పార్ట్ బీను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించాల్సి ఉంటుంది. 48 శాతం బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమీకరిస్తారు. మిగిలిన 4 శాతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సమకూర్చుకోవాలని డీపీఆర్‌లో పేర్కొన్నారు.