విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు

Rahul Gandhi: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. విజయ్ ఇటీవల తమిళనాడులో రాజకీయ పార్టీ స్థాపించడంతో, ఈ సినిమా వాయిదా అంశం రాజకీయంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని ఆయన అన్నారు.
మంగళవారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కావాలనే ఈ సినిమాను అడ్డుకుంటోందని ఆరోపించారు. “మోదీ గారు.. తమిళ ప్రజలను అణచివేయాలనే మీ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు” అని ట్వీట్ చేశారు. గత వారం విడుదల కావాల్సిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ చిక్కుల వల్ల వాయిదా పడింది. దీనిపై కోర్టును ఆశ్రయించినా వెంటనే ఉపశమనం లభించలేదు. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం జోక్యం వల్లే సినిమా విడుదల నిలిచిపోయిందని చిత్ర యూనిట్‌తో పాటు తమిళ సినిమా వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ కావాలనే ఈ సినిమాను ఆపే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించి, విజయ్‌కు మద్దతుగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే బీజేపీ మాత్రం, సినిమాటోగ్రఫీ చట్టాలు మరియు నిబంధనల ప్రకారమే సినిమా వాయిదా పడిందని వివరణ ఇచ్చింది.



