Jagga Reddy : మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి దంపతులు

Jagga Reddy: కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 ఏళ్ల క్రితం సంగారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ దంపతుల చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాగా ఏడాది క్రితం బైక్ మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కంటి నుంచి బ్రెయిన్ కు వెళ్లే నరం వీక్ కావడంతో చూపు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గాయాలైన సమయంలో నెల రోజులు కోమాలోకి వెళ్లాడు కూడా. ఆప్టిక్ హైడ్రోపి అనే ఈ వ్యాధి చికిత్స కోసం ఇప్పటి వరకు 5 లక్షలు వరకు ఆ పేద దంపతులు ఖర్చు పెట్టారు. తిరిగి చూపు రావాలంటే మరో రెండు ప్రధాన చికిత్సలు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. అందుకోసం దాదాపుగా 8 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. ఆక్యు పంక్చర్,స్టెమ్ సెల్ రిజనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని డాక్టర్లు స్పష్టం చేశారు.
నిరుపేద దంపతుల కొడుకు సంపూరన్ జగ్గారెడ్డి దంపతుల వద్దకు వచ్చి తన పరిస్థితిని వివరించడంతో జగ్గారెడ్డి, నిర్మల దంపతులు చలించిపోయారు. అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు వెంటనే అందించేందుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చికిత్స కోసం 10 లక్షలు తక్షణంగా జగ్గారెడ్డి దంపతులు సంపూరన్ తల్లిదండ్రులకు అందించారు.
అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించి చూపు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దాతృత్వాన్ని చాటుకున్న జగ్గారెడ్డి దంపతులకు కిషన్ పవార్, శాంతాబాయిలు చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



