తిరుమల శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్ వెజ్ హోటల్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఏడుకొండలపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు. స్వామివారు కొలువైన ఆలయంలోని గర్భగుడి పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయం అని అంటారు. ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం తిరుమల కొండపైకి అడుగు పెట్టగానే పులకించి పోతాడు.
అటువంటి ఆలయ నమూనా సెట్టింగ్‌తో ఏర్పాటు చేసిన ఓ హోటల్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతుంది. హోటల్ నిర్వాహకుల తీరుపై భక్తజనం మండిపడుతున్నారు. ఇంతకీ ఎక్కడుంది ఆ హోటల్..? హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆ హోటల్‌లో ఏం జరుగుతోంది..?
ఆనంద మూర్తిగా వెలసిన ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు. ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. స్వామి వారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు లక్షలాది మంది భక్తులు.
అలాంటి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు హోటల్ యాజమాన్యాలు ఆనంద నిలయంలాగా కనిపించే హోటల్‌ను తయారు చేశారు. అది చూసి అదిగో ఆనంద నిలయం అని ఆనందంగా వెళ్లారో అవాక్కయిపోతారు. అక్కడకు వెళితే, చికెన్, మటన్ బిర్యానీల ఘాటు వాసన గుప్పుమంటుంది. అది ఆలయంలా కనిపించే నాన్‌వెజ్ హోటల్.
పైకి ఆనంద నిలయంలా కనిపించే ఆలయ వాతావరణం లోపల నాన్‌వెజ్ మిలటరీ హోటల్ రన్నింగ్. దేవుడిని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కన్నింగ్ గాళ్లు. చూడడానికి శ్రీ వేంకటేశ్వరుడి మందిరంలా ఉన్నా అది దేవాలయం కాదు. రాజమండ్రి-విశాఖ హైవేపై తిరుమల ఆనంద నిలయాన్ని పోలి ఉన్న ఓ సెట్టింగ్. ఓ మిలటరీ హోటల్‌కి ఈ తరహా సెట్టింగ్‌లు అద్ది క్యాష్ చేసుకుంటున్నాడు ఓ నిర్వాహకుడు. హోటల్‌లో తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే ఆనంద నిలయం సెట్టింగ్‌ని వేసి, అక్కడే నాన్‌వెజ్ వడ్డిస్తూ మిలటరీ హోటల్ నడుపుతున్నారు కొందరు ప్రబుద్ధులు.
రాజమండ్రి వద్ద ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉండటమే కాకుండా… జయ-విజయలు, బంగారు వాకిలి, రాములవారి మెడ, కులశేఖరపడి లాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెటల్‌లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టను కించపరిచినట్లు భక్తులు మండిపడుతున్నారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ జనసేన ఆగ్రహించింది.
హెటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన రాయల్ అనే భక్తుడు తక్షణమే టీటీడీ ఈవో, ఛైర్మన్‌లకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు, వీడియోలతో సహా.. పూర్తి సమాచారం అందజేశారు. క్షమాపణలు చెప్పి 24గంటల్లో సెట్టింగ్ తొలగించకపోతే దాడిచేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ వార్నింగ్ ఇచ్చారు. హోటల్ తీరుపై టీటీడీ చైర్మన్, EOకి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఆలయం ఒక్కటే కాదని, అది కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి గర్భాలయ నమూనాను ఓ మాంసాహార హోటల్ కు ఉపయోగించడమేంటని ప్రశ్నిస్తున్నారూ భక్తులు. ఇది భక్తుల మనోభావాలను గాయపరచడమే కాకుండా, తిరుమల ఆలయం గొప్పతనాన్ని, గౌరవాన్ని తక్కువ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా శ్రీవారి గర్భాలయ నమూనాలతో నాన్ వెజ్ హోటళ్లు పెరిగిపోతే ఇది భక్తుల మనోభావాలపై ఘాతుకమే అవుతుంది.
దీని పట్ల చర్యలు తీసుకోకపోతే, రాయుడు హోటల్ ఎదుట భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నామని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి టీటీడీ దృష్టి పెట్టాలని కిరణ్ రాయల్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలకు సోషల్ మీడియాలోను భారీ స్పందన లభిస్తోంది.
ఇక తిరుమల యాత్ర పేరుతో వెంకన్నను ఏకంగా గేమింగ్ యాప్‌లో దింపేశారు మరికొందరు. కొద్ది రోజుల క్రితమే తిరుమల శ్రీవారి ఆలయ యాత్ర పేరుతో ఓ గేమింగ్ యాప్‌ను డెవలప్ చేసింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. రోబ్లెక్స్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను ఉంచారు నిర్వాహకులు. తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేశారు.
ఆలయానికి ఎలా వెళ్లాలో ఇందులో వివరించారు. ఈ గేమింగ్ యాప్‌ని అడ్డుపెట్టుకుని శ్రీవారి పేరుతో వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. ఇక ఓ సినిమాలో ఏకంగా గోవింద నామాలపైనే పేరడీ పాటలు పెట్టారు మరికొందరు. గాడ్‌తో గేమ్స్ వద్దన్నా వినకుండా, ఇలా చెలరేగిపోతున్నారు కొందరు ప్రబుద్ధులు.
తిరుమల శ్రీవారి గర్భాలయం అంటే ప్రతి హిందువు గుండె లోతుల్లో భక్తితో నిలిచే పవిత్ర స్థలం. అలాంటి ఆలయ నమూనాను ఉపయోగించి ఓ హోటల్ నిర్మించడం, అందులో మాంసాహార వంటకాలను వడ్డించడం నిజంగా శ్రద్ధా సంపన్న భక్తుల మనసును కలచివేస్తోందన్నది అసలు ఆరోపణ. ఇది సాధారణ వ్యాపార చర్యగా కాకుండా, భక్తుల మత భావనలపై అవమానకరంగా ఉందంటూ భక్తులు మండిపడుతున్నారు.
హోటలో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను కించపరచినట్లు భక్తులు మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. టీటీడీ ఈ విషయంలో తక్షణమే స్పందించి, న్యాయపరంగా, పరిపాలనా పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తిరుమల గర్భాలయ నమూనా పేరుతో మాంసాహార హోటల్ నడిపిన వ్యవహారం పునరావృతం కాకుండా.. టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
మొత్తం మీద ఈ విషయంపై టీటీడీ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే చివరగా కొసమెరుపు ఏమిటంటే.. భక్తి కొద్ది ఆ నమూనాను తయారు చేసి ఉండవచ్చని, మరికొందరు నెటిజన్స్ హోటల్ యాజమాన్యానికి మద్దతుగా కామెంట్స్ చేయడం విశేషం. శ్రీవారి ప్రతిష్ఠను బిజినెస్‌కు వాడుకోవడం ఎంతవరకు న్యాయం? ఇది కేవలం అలంకరణ కాదు. మతసంబంధిత గౌరవాన్ని తృణప్రాయంగా తీసుకునే చర్య అంటూ స్పందిస్తున్నారు. కొన్ని సంఘాలు ఇప్పటికే హోటల్ మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.



