అంతర్జాతీయం

అమెరికా బాటలోనే మెక్సికో.. భారత్‌పై 50 శాతం సుంకాలు

ఏంటో ఆ మనిషేంటో అన్నీ ఇలాగే చేస్తాడని ప్రపంచమంతా నిట్టూర్చుతుంది. ఇంతలోనే ప్రేమ. అంతలోనే ద్వేషం. ఆ కొద్దిసేపట్లోనే ఆంక్షలు, మరిసటి క్షణంలో పొగడ్తలు ఇదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు. తన మాట వింటే ఓకే తనకు అడ్డమొస్తానంటే డబుల్ ఓకే అంటూ అంతు చూస్తానంటాడు. మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కొక్కదానిని లెక్కేసి మరీ దెబ్బకొడుతున్న ట్రంప్ ఇప్పుడు రోజుకో కొత్త కథ చెబుతున్నాడు. ఒకరోజు రష్యాపై ఆంక్షలు విధిస్తానంటాడు. మరుసటి రోజు ఆంక్షల్లేవంటాడు. ఏ రోజు ఎందుకు ఎలా మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు. ఓవైపు ట్రంప్ మిగిలిన చద్దన్నాన్ని పులిహోర కలిపి మరీ వడ్డిస్తుంటే ఇప్పుడు మెక్సికో కూడా అదే బాటలో నడుస్తోంది.

ఇప్పటికే ట్రంప్ దెబ్బకు కకావికలమైన మెక్సికో ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే ఉత్పత్తులకు 50 శాతం సుంకాలు మోదింది. ఇప్పటికే సుంకాలు పెంపుతో అమెరికన్లు చావలేక చస్తుంటే ఇప్పుడు మెక్సికో అదే దారిలో నడుస్తోంది. ప్రజలను పేదోళ్లను చేసి ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నాలు అటు అమెరికా, ఇటు మెక్సికో చేస్తోండటం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయ్. అధిక సుంకాలు వల్ల ప్రజల ఖర్చులను పెరుగుతాయని, స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైనా, ఇండియా, చైనాతో వ్యాపారాన్ని తగ్గించుకోవాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ప్రభుత్వం దేశ ప్రజలను కోరారు.

ఆటో విడిభాగాలు, తేలికపాటి కార్లు, బొమ్మలు, దుస్తులు, వస్త్రాలు, ప్లాస్టిక్‌లు, ఫర్నిచర్, పాదరక్షలు, ఉక్కు, గృహోపకరణాలు, తోలు వస్తువులు, అల్యూమినియం, కాగితం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, కార్డ్‌బోర్డ్, మోటార్‌సైకిళ్లు, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాల దిగుమతులపై కొత్త సుంకాలు విధించింది. రెండు దేశాలు సుదారాన ఉన్నప్పటికీ ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యం ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, సీఐఐ డేటా ప్రకారం, రెండు దేశాల మధ్య వాణిజ్యం 2019-20లో $7.9 బిలియన్లుగా ఉండగా 2023-24లో $8.4 బిలియన్లకు పైగా పెరిగింది. కొత్త సుంకాలతో పలు వస్తువులపై ధరలు 35 శాతం వరకు పెరుగుతాయి.

మెక్సికో చర్య వల్ల ఆటోమొబైల్ రంగం ఎక్కువగా ప్రభావితమవుతుందని భావిస్తున్నారు. కార్లపై దిగుమతి సుంకం 20 శాతం నుండి 50 శాతానికి పెరుగుతుంది. ఇది ఇండియాలోని అతిపెద్ద వాహన ఎగుమతిదారులైన వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకిలకు గణనీయమైన దెబ్బతీస్తుంది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుండి వందలాది ఉత్పత్తులపై వచ్చే ఏడాది నుండి అధిక సుంకాలను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఆమోదించింది.

ఏదైనా చేస్తా.. ఏమైనా చేస్తా.. డబ్బు కావాలి. అంతే. ఇండియన్లను, చైనా వాసుల్ని వెల్లగొడితే తప్ప అమెరికా బాగుపడదన్న ట్రంప్ గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఎవరికైనా అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తానంటున్నాడు. ఇప్పటి వరకు అమెరికాలో సరైన విధానాలు లేకపోవడం వల్ల స్థానిక యూనివర్శిటీల్లో అద్భుతమైన విద్యను అభ్యసించినవారు కూడా అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తోందని అలాంటి వారి కోసమే గోల్డ్ కార్డ్ తెస్తున్నానని ట్రంప్ చెప్పాడు.

ఇప్పటి వరకూ నైపుణ్యం ఉన్న యువతను బయటకు పంపే వ్యవస్థను ట్రంప్ హాస్యాస్పదమని అభివర్ణించాడు. ఈ కార్డ్ ఆ అన్యాయానికి ముగింపు పలుకుతుందన్నాడు. ఇండియా, చైనా వంటి దేశాల విద్యార్థులు అగ్రశ్రేణి యూనివర్శిటీల నుంచి పట్టభద్రులయ్యాక అమెరికా విడిచి వెళ్లవలసి రావడం అవమానకరమని విమర్శించాడు. కొత్త వీసా పథకం అత్యంత శిక్షణ పొందిన, తరగతుల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను నియమించుకోవడంలో అమెరికన్ కంపెనీలకు భరోసా ఇస్తుందన్నాడు.

చాలా మంది ఉన్నత ప్రతిభ ఉన్నా ఏళ్ల తరబడి వీసా సమస్యలు ఎదుర్కోవడం అన్యాయమన్నాడు. ప్రస్తుతం చదువు పూర్తయ్యాక చాలా మంది భారతదేశం, చైనా, ఫ్రాన్స్‌లకు తిరిగి వెళ్లాల్సి వస్తోందన్న ట్రంప్ అది చాలా దారుణమన్నాడు. ఇది ఒక హాస్యాస్పద పరిస్థితిని కలిగిస్తోందన్నాడు. అందుకే ఆ పద్ధతిని మార్చేస్తున్నానన్నాడు. గోల్డ్ కార్డ్ వెబ్‌సైట్ ప్రారంభమైందన్న ట్రంప్… వార్టన్, హార్వర్డ్, ఎంఐటి వంటి విశ్వవిద్యాలయాల నుంచి కంపెనీలు ఎంపిక చేసిన విద్యార్థులను అమెరికాలో ఉంచుకోవడానికి ఈ కార్డ్‌ను కొనుగోలు చేయవచ్చన్నాడు.

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సహా పలువురు దిగ్గజ కంపెనీల అధినేతలు, విదేశీ ప్రతిభను శాశ్వతంగా ఉంచుకోవడంలో అనిశ్చితి ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారన్నాడు ట్రంప్‌. ఆయా వ్యక్తులు వీసాను కొనుగోలు చేయాలంటే $1 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 9 కోట్లుగా నిర్ణయించగా, అదే కంపెనీలు వ్యక్తులకు వీసా ప్రాసెస్ చేయాలంటే ఆ మొత్తం $2 మిలియన్‌లు అంటే 18 కోట్లుగా ధరను నిర్ణయించినట్టు అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ తెలిపాడు.

అందరూ బాగుండాలి. అందులో మనముండాలన్నది ఓల్డ్ ఫిలాసఫీ. మనం బాగుండాలంటే మనతో ఎవరుండాలన్నది న్యూ ఫిలాసఫీ. ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధాంతంలా కన్పిస్తోంది. వివిధ దేశాలపై ఆంక్షలు, సర్దుబాట్లతో తలబొప్పి కట్టడంతో ట్రంప్ ఇప్పుడు తన పెత్తనం ప్రపంచంపై ఉండదన్న స్పృహలోకి వస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఐతే ప్రపంచంలోని కీలక సంస్థలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కొత్త సంస్థను ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐతే ఈ సారి యూరప్ లేకుండా కొత్త ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. G7 స్థానంలో C5 కంట్రీస్‌తో కూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అమెరికా, రష్యా, చైనా, భారతదేశం, జపాన్‌లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎలైట్ C5 లేదా కోర్ ఫైవ్ అని నామకరణం చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

దీనిపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేనప్పటికీ, కొత్తగా ట్రంప్ ఈ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైట్ హౌస్ గత వారం ప్రచురించిన జాతీయ భద్రతా వ్యూహాన్ని అమెరికన్ ప్రచురణ విభాగం రిపోర్ట్ చేసింది. ఈ ప్రణాళికను వైట్ హౌస్ నిర్ధారించలేమన్నప్పటికీ నిప్పు లేకుండా పొగ లేదన్న చందంగా, కన్పిస్తోంది. ఈ ఆలోచన ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలు భాగస్వాములుగా మారి, ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యూహాలను పూర్తి స్థాయిలో మార్చేసే అవకాశం ఉంది.

ఇది కూడా G7 లాగా, నిర్దిష్ట అంశాలపై శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రతిపాదిత C5 ఎజెండాలో మొదటిది పశ్చిమాసియాలో భద్రత, ప్రత్యేకంగా ఇజ్రాయెల్- సౌదీ అరేబియా మధ్య సంబంధాలను కూల్ చేయడం ముఖ్యంగా కన్పిస్తోంది. ఐతే ఇలాంటి ఆలోచనలు తమ వద్ద ఏవీ లేవని వైట్ హౌస్ పేర్కొంది. అయితే, జాతీయ భద్రతా నిపుణులు ఈ ఆలోచనకు ట్రంపియన్ రింగ్ ఉందని నమ్ముతున్నారు.

C5 సృష్టి ప్రస్తుత వైట్ హౌస్‌కు కీలకమంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి వచ్చాక, ప్రపంచ క్రమాన్ని ఎంతగా మార్చాలని యోచిస్తోందనే దానిపై అమెరికా ఇప్పటికే చర్చలు జరుపుతున్న సమయంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ ఆలోచన G7, G20 వంటి ప్రస్తుత వేదికలను దెబ్బకొట్టి, తాను ప్రపంచ విజేతగా నిలబడాలన్న ట్రంప్ ఆలచనల్లోంచి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న సంస్థల వల్ల ఒరిగేదేం లేదని, ప్రధాన జనాభా, సైనిక ఆర్థిక శక్తుల మధ్య ఒప్పందాలే ప్రపంచానికి మేలు చేస్తాయని అమెరికా అంటోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button