KTR: అసత్య ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్న కేటీఆర్

KTR: అవినీతి ఆరోపణలు.. రాజకీయ విమర్శలు.. వ్యక్తిగత జీవితం టార్గెట్.. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. . ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం కూడా పాలిటిక్స్‌లో కామనే. కానీ వ్యక్తిగత విమర్శలకు వచ్చేసరికి లీడర్లు కూడా హర్ట్ అవుతున్న పరిస్థితి. వ్యక్తిగత విమర్శలు, హద్దులు దాటి తిట్ట పురాణం కొన్ని రోజులుగా బాగా పెరిగిపోతోంది. రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
ఈ మధ్య ఇవన్నీ కాస్త శృతి మించుతున్నాయి. ఇకపై ఇలాంటి వ్యవహారాలను మరింత సీరియస్ గా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట గులాబీ ఆగ్రనేత . ఈ క్రమంలో తనపై అడ్డగోలుగా.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నవారిపై ఇకపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ఆ నేత హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో పాలిటిక్స్‌లో నేతల వ్యవహారశైలి కాస్త శృతి మించుతోంది. అందులోను వ్యక్తిగత విమర్శలు, ఆరోణపలు హద్దులు మీరుతున్నాయి. నాయకులు మాట్లాడే భాష సైతం కొనని సందర్బాల్లో అతి జుగుప్సాకరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇలాంటి వ్యవహారాలను ఇకపై సీరియస్ గా తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పకనే చెబుతున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. తనపై అసత్యపు ప్రచారం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్న కేటీఆర్.. అలాంటి వారిపై లీగల్ ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నవారిపై ఇంకాస్త స్ట్రాంగ్‌గా లీగల్ ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారట. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో కేటీఆర్ సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని, బీఎన్‌ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు కేటీఆర్. తాను ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తొమ్మిదేండ్లకుపైగా రాష్ట్ర మంత్రిగా పనిచేశానని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కేసులో కొండా సురేఖ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరై వివరణ సైతం ఇచ్చుకున్నారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి గతంలో లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేకపోయినా ఈ నేతలంతా కూడా తనను బద్నాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. తనపై ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సైతం కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన సందర్భం ఉంది. ఫోన్ ట్యాఫింగ్, డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధారమైన తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్ కుమార్ గౌడ్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేశ్‌కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలా తనపై అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేని అంశాలను లేవనెత్తడంపై కేటీఆర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి సారించారు. అలాంటి వారిపై లీగల్ గా ఫైట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇకపై ఎవరు తనపై అసత్య ఆరోపణలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు కేటీఆర్. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.