ఉగాదికి ప్రత్యేక పూజలు చేస్తున్న ముస్లీంలు

Kadapa: సోముని తోబుట్టువట…. సొంపు కలలకేమరుదు….కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి …చూడరమ్మ సతులాలా సోభాన పాడరమ్మ..అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య వెంకన్న స్వామి ధర్మపత్ని బీబీ నాంచారమ్మ గురించి వర్ణిస్తాడు. నాంచారమ్మకు వెంకటేశ్వర స్వామికి సంది ఎలా కుదిరింది. లక్ష్మిదేవిలాంటి భార్య ఉండగా నాంచారమ్మకు స్వామి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ముస్లింలకు ,వెంకటేశ్వర స్వామికి బందురికం ఎలా ఏర్పడింది. ఈ బందురికానికి ఉగాది పండుగకు లింక్ ఏంటి?వాచ్ దిస్ స్టోరీ
ప్రతి ఏటా తెలుగు నామ కొత్త సంవత్సరం ఉగాది వచ్చిందంటే చాలు హిందువులకే కాదు ముస్లింలకు కూడా ప్రత్యేకం కడపలో వెలసిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆయనకి వారంతా మొక్కులు చెల్లించుకోవడానికి తరలి వస్తారు. ఉదయం ఇంట్లో ఏ ఇతర పనులు చేసుకోకముందే గుడికి వచ్చి స్వామి వారికి భత్యం సమర్పించుకున్న తరువాత వారి ఇంట్లో నిష్ట కార్యక్రమాలు చేసుకుంటారు. స్వామి వారికి కాయా కర్పూరం సమర్పిస్తారు.కోరికలు కోరుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.
హిందువైన మాలిక్ కాపీర్ అనే సేనాని ఉండేవారు. తరువాత అల్లాఉద్దిన్ ఖిల్జీ వద్ద ఆయన సేనాధిపతిగా చేరి ముస్లిం మతాన్ని స్వీకరించారు. దక్షిణ భారతదేశంపైకి దండయాత్రగా వచ్చిన సమయంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం భక్తుల కానులకతో తులతూగేది. స్వామివారి విగ్రహంతో పాటు ఆ కానులన్నీ తీసుకెళ్లిన మాలిక్ తన ఇంట్లో దాచాడు. అందులో ఉన్న స్వామి వారి విగ్రహాన్ని చూసి మాలిక్ కూతురు అయిన బీబీ నాంచారి మనసు పడింది.
తరువాత శ్రీరంగంలోకి స్వామి భక్తులు ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు. ఆ విషయం తరువాత తెలుసుకున్న బీబీ నాంచారి శ్రీరంగం వచ్చి స్వామిని మనువాడి ఆయనలో ఐక్యం అయ్యింది. బీబీ నాంచారి అసలు పేరు సురతాని బీబీ అంటే భార్య, నాంచారి అంటే భక్తులు భక్తురాలి వచ్చి భార్యగా మారడంతో అప్పటి నుంచి ఆమెను బీబీ నాంచారిగా పిలిచేవారు.
తమ ఇంటి ఆడబిడ్డ బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలంతా అల్లుడిగా భావిస్తారు. పండుగనాడు కూతురు, అల్లుడికి బట్టలు పెట్టి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మూడు తరాలుగా ప్రతి ఉగాదికి స్వామిని దర్శించుకునే ముస్లింలు కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి తొలి గడప అయిన.. దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం సోదరులు దర్శించి ప్రార్థనలు నిర్వహించారు.
ఉగాది పండుగను కడపలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి ఉగాది రోజున తిరుమల తొలి గడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి, కానుకలు సమర్పించడం ఇక్కడి ముస్లింలకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఉదయాన్నే దేవుని కడప ఆలయానికి చేరుకుని, కాయకర్పూరం సమర్పించి, ముడుపులు సమర్పించారు ముస్లిం భక్తులు.
ఉగాది రోజున వేంకటేశ్వరుడిని దర్శించి, ఆలయ పూజారికి బియ్యం బేడలు సమర్పించి, ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ముస్లింల విశ్వాసం. అందుకే క్రమం తప్పకుండా దేవుని కడపను ముస్లింలు ఉగాది రోజున సందర్శించి మత సామరస్యాన్ని చాటుతున్నారు.
చూసేవారికి కొత్తగా అనిపించినా, తమ బీబీ నాంచారమ్మను శ్రీనివాసుడు పరిణయం చేసుకున్నాడరన్న కారణంతో కడప ముస్లింలు మాత్రం అత్యంత భక్తితో, ప్రీతి పాత్రంగా ఉగాదిని జరుపుకుంటున్నారు. ఏ ఏడాదైనా ఉగాదిని ఇలా జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడ్డామని, కొందరు ముస్లింలు చెబుతున్నారు.
తమ పూర్వీకుల నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది. పెద్దలు చేసినట్లే తాము ఇప్పుడు గుడికి వచ్చి ఉగాదిని జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆలయం మతసామరస్యాన్ని చాటుచెబుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మతాంతర వివాహాలు చేసుకుంటున్న యువతపై దాడుకులకు పాల్పడుతున్న ఈ కాలంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ముస్లింలు ఆరాదించడం చూసే ముచ్చటేస్తుంది. మత సామరస్యానికి ప్రతీకగా మతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని చాటుతున్నారు. మనం దైవంగా భావించేవారికే అభ్యంతరం లేని మతం మన మద్యన ఎందుకు ? అడ్డుగోడలు కడుతుందని ప్రశ్నిస్తున్నట్లు ఉంది ఈ దృశ్యం.
అల్లా పేరు చెప్పి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశాల మధ్య చిచ్చు పెట్టి మత గ్రంధాల సారాన్ని మార్చి రాసి మూర్కపు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలకు, వాటికి ఆకర్షితులు అవుతున్న యువతకు ఈ కథనం కనువింపు కావాలని కోరుకుందాం.