Stock Market: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలను పడేశాయి. దీనికి తోడు పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లకు పైగా పతనమవ్వగా నిఫ్టీ 24వేల మార్క్‌ను కోల్పోయింది. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మార్కెట్ విలువలో రూ.7.5లక్షల కోట్ల మేర ఆవిరైంది.
ఇవాళ్టి ట్రేడింగ్‌ను సూచీలు సానుకూలంగానే ప్రారంభించినప్పటికీ కాసేపటికే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 952.7 పాయింట్లు కుంగి 78వేల 850.71 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ 324.7 పాయింట్లు దిగజారి 23వేల 922.05 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 1.56శాతం మేర నష్టాల్లో ఉంది. ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ షేర్లు 2.71శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 0.62శాతం, ఐసీఐసీఐ షేర్లు 0.42శాతం మేర కుంగాయి.