Newsనేరం

ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లిన స్టూడెంట్ శవమై ఎలా కనిపించాడు? కలెక్టర్, ఎస్పీ ఏమంటున్నారు?

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న షేక్‌ సమీర్‌, ఊరు సమీప పొలాల్లోని ఓ బావిలో శవమై తేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్‌ 24న ఆ స్కూల్లో చదువుతున్న తోటి విద్యార్థులే సమీర్‌ను చంపి బావిలో పడేశారని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సమీర్‌ నాయనమ్మ మస్తాన్‌ బీ, గుంటూరు కలెక్టరేట్‌లో ఇచ్చిన గ్రీవెన్స్‌ నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం రేపుతోంది.

మస్తాన్‌ బీ ఏం చెప్పారంటే..

‘‘షేక్‌ సమీర్‌ నా మనుమడు. మా సొంతూరు గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామం. నా కుమారుడు (సమీర్‌ తండ్రి) కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సమీర్‌ చిన్నతనంలో అతడి తల్లి మృతి చెందింది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ప్రస్తుతం నేను ఉంటున్న తాడికొండ మండలం పొన్నెకల్లులోనే సమీర్‌ ఉంటూ.. జెడ్పీ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత నెల 24న ఒంట్లో బాలేదని స్కూలుకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం తన తోటి విద్యార్థులు వచ్చారని బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రామస్థులు వచ్చి మీ మనుమడు పొలం బావిలో శవమై తేలాడని చెప్పారు’’ అని సమీర్‌ నాయనమ్మ మస్తాన్‌ బీ విలపించారు.

‘తోటిపిల్లలే చంపేశారని అంటున్నారు..’

‘‘అంతకు ముందు స్కూల్లో గొడవ జరిగిందట. అవేమీ మాకు తెలియదు. కొంతమంది పిల్లలు వచ్చి బావిలో ఈత కొడదామని చెప్పి మా మనుమడిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లారు. అక్కడే గొడవ పడి చంపేసి బావిలో పడేశారని అంటున్నారు. మొదట్లో ఇవేమీ మాకు తెలియదు. నేను అంత్యక్రియలు చేసేందుకు మా సొంతూరు కర్లపూడి తీసుకువెళ్లినప్పుడు శరీరంపై రక్త గాయాలు కనిపించాయి. దాంతో అందరికీ అనుమానం వచ్చింది. మా ఊరి పెద్ద, సర్పంచ్‌ భర్త రామారావును కలిసి చెబితే ముందు ఆయన స్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారి నుంచి సరిగ్గా స్పందన రాకపోవడంతో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాం’’ అని బీబీసీకి మస్తాన్‌ బీ చెప్పారు.

సమీర్‌ మృతిపై ఎన్నో అనుమానాలు

ఇదే విషయమై రామారావు మాట్లాడుతూ.. ‘‘మస్తాన్‌ బీది చాలా నిరుపేద కుటుంబం. కొడుకు కోడలు చనిపోయారు. ఇంకో రెండు మూడేళ్లలో చేతికి అందివస్తాడనుకున్న మనుమడు ఇలా అర్ధంతరంగా చనిపోయాడు. అతని మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బావిలో పడ్డాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటల తర్వాత మృతదేహాన్ని పైకి తీశారు. దాదాపు పది గంటలసేపు బావిలో శరీరం ఉన్నా.. నోట్లో చుక్క నీరు లేరు. పోస్టుమార్టం చేయకుండానే బాడీ అప్పగించేశారు. దీనిపై పూర్తి విచారణ జరిగితేనే వాస్తవాలు బయటికొస్తాయి’’ అని అన్నారు.

దీనిపై తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని స్కూలు ఉపాధ్యాయుడు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘స్కూల్లో ప్రతి గురువారం సాయంత్రం మాక్‌ డ్రిల్‌ ఉంటుంది. అక్టోబర్‌ 24న కూడా మాక్‌ డ్రిల్‌ ఉన్నా కొందరు విద్యార్థులు బయటకి వెళ్లిపోయారు. వీరంతా ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తూ పడి సమీర్‌ చనిపోయాడా? లేదా విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందా? అనేది తెలియదు. కానీ, జరిగిన ఘటన చాలా దురదృష్టకరం’’ అని అన్నారు.

విచారణకు ఆదేశించాం: జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

‘‘వాస్తవానికి గత నెల 24నే విద్యార్థి బావిలో పడి చనిపోయినట్టు స్కూలు ఉపాధ్యాయుల నుంచి రిపోర్ట్‌ వచ్చింది. అయితే ఇప్పుడు విద్యార్థి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన తర్వాత ఎవరైనా బాధ్యులని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి బీబీసీతో చెప్పారు.

విచారణ చేస్తున్నాం: డీఈవో రేణుక

‘‘ఆ రోజు బాలుడు ప్రమాదవశాత్తూ బావిలో కాలు జారిపడినట్టు చెప్పారు. అందుకే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఆరోపణలు రావడంతో తెనాలి డిప్యూటీ ఈవోతో విచారణ చేయిస్తున్నాం. మృతుడి నాయనమ్మతో పాటు స్కూలు ఉపాధ్యాయులను కూడా విచారిస్తున్నాం. విచారణ పూర్తయితేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక బీబీసీతో చెప్పారు.

జిల్లా ఎస్పీ ఏమంటున్నారు?

‘‘ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనే. మృతుడు సమీర్‌, మరో ఇద్దరు విద్యార్థులు ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లారు. ముందుగా షర్ట్‌ విప్పేసి సమీర్‌ దిగాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు దిగుదామనే లోపే అతడు నీళ్ల లోతుల్లోకి వెళ్లడం చూశారు. వెంటనే భయపడి పారిపోయారు. చుట్టుపక్కల ఆవులను మేపేవాళ్లు చూసి గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఊరందరి సమక్షంలోనే రాత్రి పూట మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం చేయించేందుకు బంధువులు తీవ్రంగా నిరాకరించారు. దాంతో, సున్నితమైన అంశం కావడంతో సమస్య అవుతుందని భావించి పోలీసులు ఊరుకున్నారు. అంతకుమించి జరిగిందని మేం భావించడం లేదు’’ అని గుంటూరు జిల్లా ఎస్పీ సురేష్‌ కుమార్‌ బీబీసీకి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button