High Court: ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ

High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు, సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తామూ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది.
50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.
దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42 శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్కు అందించే అవకాశం ఉంది. గెజిట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్విడుదల చేయనుంది.



