Harish Rao: చంద్రబాబు తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటలా ఉంది

Harish Rao: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్‌తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం చేసుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే దీన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవులు మూసుకున్నారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల కడతామంటే కదా నేను అడ్డుకునేది అని మొన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు. కానీ ఇప్పుడు లోకేశ్ మాత్రం ఎవరు అడ్డొచ్చినా బనకచర్ల కట్టితీరుతామంటున్నారు.
లోకేశ్ ఏ ధైర్యంతో బనకచర్లపై బరితెగించి మాట్లాడుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గురదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డూడూబసవన్నలుగా తలూపడం వల్లే లోకేశ్ ఆ రకంగా మాట్లాడుతున్నారన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధైర్యంతోనే లోకేశ్ ఈ తరహా మాట్లాడుతున్నారు.
ఓ వైపు లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరుతామని మాట్లాడుతుంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం అర్థం అవుతున్నదన్నారు. గోదావరి-బనకచర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్ కే రామని సీఎస్ లేఖ రాస్తే ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి సమావేశంలో పాల్గొని కమిటీ ఏర్పాటుకు ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, బీజేపీ సహకరించడం వల్లే ఏపీ ఈ అంశంలో ముందుకెళుతోందన్నారు.