AP: టీడీపీ పార్టీకి గవర్నర్ పదవి ఆఫర్… ఆ ఇద్దరిలో ఎవరు?

AP News: తెలుదేశం పార్టీకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందా.. టీడీపీకి గవర్నర్ పదవి ఖాయమైందా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీకి గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందట. టీడీపీ నుంచి గవర్నర్ రేసులో ఆ ఇద్దరు నేతలు ఉన్నారట మరి చంద్రబాబు మదిలో ఎవరున్నారు.. ఇంతకూ రేసులో ఉన్న ఆ ఇద్దరు నేతలెవరు..? అందులో ఫైనల్ అయ్యేది ఎవరు..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం ఇచ్చింది. టీడీపీకి గవర్నర్ పదవిని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వం టీడీపీకి గవర్నర్ పదవిని ఆఫర్ చేసిందని తగిన అభ్యర్థిని సూచించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కోరిందనే టాక్ వినిపిస్తోంది.
న్యూఢిల్లీ నుండి వచ్చిన నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త గవర్నర్లను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. బీహార్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున నియామకాలకు సంబంధించి బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎన్డీయే మిత్రపక్షాలకు గవర్నర్ పదవులను అందించడంతో పాటు.. రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని బీజేపీ నిర్ణయించిందట. 2014-19 కాలంలోనే టీడీపీకి నాడు గవర్నర్ పదవిపై బీజేపీ హామీ ఇచ్చింది. అయితే.. ఆ తరువాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు. ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీ కీలకంగా ఉంది. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాల నేపథ్యంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులో టీడీపీ సహకరించింది.
దీనికి ప్రతిఫలంగా గవర్నర్ పదవిపై బీజేపీ మరోసారి ఆలోచన ప్రారంభించింది. దీనికి సంబంధించి టీడీపీకి ఇప్పటికే సంకేతాలు అందాయట. టీడీపీకి గవర్నర్ పదవిని కేటాయిస్తామని బీజేపీ ముఖ్య నేత తెలియజేసినట్లు సమాచారం. దీంతో గవర్నర్ పదవికి చంద్రబాబు ఎవరి పేరును సిఫారసు చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.
గవర్నర్ పదవికి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరూ పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలందించారు. ఇద్దరు నాయకులు చంద్రబాబుకు సన్నిహితులు. వీరిద్దరూ అసెంబ్లీ స్పీకర్‌గా, ఆర్థిక మంత్రులుగా పని చేశారు. ఇక అశోక్ గజపతి రాజు మునుపటి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ ఈ ఇద్దరు నేతలకు ప్రత్యక్ష పాలనా పదవులు దక్కలేదు.
యనమల ఇటీవలే మండలి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సీటు ఇస్తేనే తాను రాజకీయాల్లో కొనసాగుతానని లేదంటే తాను పదవీ విరమణ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అశోక్ గజపతి రాజును గవర్నర్‌గా నియమిస్తే యనమల రాజ్యసభకు నామినేట్ చేయబడతారని పార్టీ వర్గాలు ఊహిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. ప్రస్తుతం టీడీపీలో ముఖ్య నేతగా వివాదారహితుడుగా పేరున్న అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతల సమాచారం. అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్, సీనియారిటీ దృష్ట్యా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట.
ఊహించని రాజకీయ పరిణామాలు జరిగితే తప్ప గజపతిరాజు నియామకం లాంఛనమేని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలో చంద్రబాబు అంతర్గత సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మొత్తానికి టీడీపీకి గవర్నర్ పదవి ఖాయమని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే.. త్వరలోనే రాజుగారు గవర్నర్ కుర్చీలో కూర్చోనున్నారు.