తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Telangana: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్‌హెచ్‌ఏ) ప్రకటించింది. ఈ మేరకు ‘టీఏఎన్‌హెచ్‌ఏ’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిశామని అయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో రూ.140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం రూ.100 కోట్ల బకాయిలు విడుదల చేశామని, మరో రూ.40 కోట్లు త్వరలో విడుదల చేయనున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు సుమారు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి.



