జాతియం

Chidambaram: నాటి కుట్రలపై మాజీ హోం మంత్రి చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

Chidambaram: బీజేపీ మీద ఉన్న అక్కసుతో దేశ భద్రత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అడ్డంగా దొరికిపోవడం కాంగ్రెస్ కు అలవాటైపోయింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం ఆపరేషన్ సిందూర్ వివాదానికి ఆజ్యం పోసేలా చేసిన కామెంట్లతో హస్తం పార్టీపై నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకాలం దాయాది పాకిస్తాన్ చేసే వాదనను సమర్ధించే విధంగా చిదంబరం వ్యాఖ్యలు ఉండటంతో కాంగ్రెస్ నేతలు పాక్ ఏజెంట్లుగా మారారంటూ కమలనాధులు ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఆపరేషన్ సిందూర్ పై అనుమానాలను నివృత్తి చేసుకునే నెపంతో పహల్గాంలో జరిగిన దాడిలో పాక్ ప్రమేయం లేదనే అర్ధం వచ్చే విధంగా చిదంబరం కామెంట్స్ ఉండటం పెద్ద దుమారం రేపాయి. గతంలో మణిశంకర్ అయ్యార్ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఆ డేమేజ్ నుంచి కోలుకునేందుకు కాంగ్రెస్ కు చాలా కాలం పట్టింది. ఇప్పుడు తమిళనాడుకు చెందిన మరో సీనియర్ నేత చేసిన కామెంట్స్ తో హస్తం ఏరకమైన చిక్కుల్లో పడుతుందో అనే చర్చ మొదలైంది.

పహల్గాంలో ఉగ్రవాదదాడులకు ప్రతీకారంగా మోదీ సర్కార్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పీఓకేతో పాటూ పాకిస్తాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులతో ప్రధాని మోదీ ఇమేజ్ బాగా పెరిగిందని బీజేపీ అంచనా. కానీ ఆపరేషన్ సిందూర్ ను తానే ఆపమని చెప్పానని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..తాజాగా ఈ ఆపరేషన్ సందర్భంగా ఐదు యుద్ధ విమానాలు కూలపోయాయని ప్రకటించడం దుమారం రేపింది.

ట్రంప్ వ్యాఖ్యలు భారత్ ను ఇరకాటంలో పడేశాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ కామెంట్లను ఆసరాగా తీసుకుని మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని హస్తం పార్టీ వ్యూహాన్ని రచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న ఆంతర్యాన్ని బయటపెట్టాలంటూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోదీ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ వివాదం వేడెక్కిన తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాటలు అగ్నికి ఆజ్యం పోశాయి.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని మోదీ సర్కార్ చెబుతోంది కానీ పాకిస్తాన్ నుంచి చొచ్చుకు వచ్చిన తీవ్రవాదులు ఈ దాడి చేశారా లేక భారత్ లో శిక్షణ పొందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే అనుమానం కలుగుతోందని చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. మోదీ ప్రభుత్వం అనవసరంగా పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎదురుదాడి చేసిందన్నది చిదంబరం మాటల అంతరార్ధమంటూ కమలనాధులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ లబ్ధి కోసం దాయాది దేశం పాకిస్తాన్ కు వత్తాసు పలికే రీతిలో కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తూ బరితెగించారని బీజేపీ విరుచుకుపడుతోంది. అటు నెటిజన్లు సైతం చిదంబరం వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. మోదీ సర్కార్ పై ఉన్న కక్ష కారణంగా చిదంబరం పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మద్దతు పలికే విధంగా మాట్లాడటం దేశద్రహమవుతుందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

ఆపరేషన్ సిందూర్ విషయంలో బీజేపీని టార్గెట్ చేయాలనుకునే వ్యూహంలో భాగంగా దేశ భద్రత అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేసే వాఖ్యలు ఒక రకంగా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మళ్లీ ఆపరేషన్ సిందూర్ సెంటిమెంట్ ను రగిల్చి లబ్ధి పొందాలని సహజంగానే బీజేపీ స్కెచ్ వేస్తోంది. తాజాగా చిదంబరం పాకిస్తాన్ వాదనను బలపరచే విధంగా చేసిన వ్యాఖ్యలతో కమలనాధులు వేసిన ఉచ్చులో కాంగ్రెస్ పడిందన్న అనుమానం వ్యక్తమవుతోంది.

దీన్నే రాజకీయ పరిభాషలో సెల్ఫ్ గోల్ అంటారు. సెక్యులర్ నినాదంతో ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసే కునే ఆలోచనతో ఇప్పటికే కాంగ్రెస్ మెజారిటీ వర్గాల మద్దతు కోల్పోయింది. ఇప్పుడు చిదంబరం వంటి కాలం చెల్లిన మేధావుల మాటలను నమ్ముకుంటే మరో సారి పుట్టె మునుగుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button