Chandrababu: పద్ధతి మార్చుకోండి..గీత దాటితే వాతే.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

Chandrababu: మళ్లీ..మళ్లీ అవే హెచ్చరికలు. ఒకటికి పదిసార్లు చెబుతున్న ఆ పార్టీ అధినేత. కేబినెట్ భేటీ అయినా…పార్టీ సమావేశమైనా….అసెంబ్లీ సెషన్స్ అయినా….క్లాసు మాత్రం కామనే. అధినేత వెంటాడుతున్నా కొందరు ఎమ్మెల్యేల్లో మార్పు రావడం లేదా….లైట్ తీసుకుంటున్నారా…..తమ అధికార దర్పంతో వెలిగిపోవాలన్న ఆలోచనే వారిని తప్పటడుగులు వేయిస్తుందా….అసలు ప్రజాసేవ చేయడానికి ఆ ఎమ్మెల్యేలకు అర్హత ఏముందన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయా….ఎమ్మెల్యేల వైఖరితో పార్టీ క్యాడర్ కూడా విసిగిపోతుందా….ఆ నేతల పనితీరుపై అధినేత తీవ్ర అసంతృప్తితో ఉన్నారా…..ఈసారి మాత్రం పద్ధతి మార్చుకోండని ఆ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా…..కఠిన చర్యలకు సిద్ధమయ్యారా…యాక్షన్ ఏ రకంగా ఉండబోతోందన్నదని సస్పెన్స్ గా మారింది…..
టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నారు కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాలు సరైన సమయంలో అమలు చేస్తుంటే ఆ ఎమ్మెల్యే లు ఎందుకు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు అగ్రహానికి ఆ ఎమ్మెల్యే లు ఎందుకు గురవుతున్నారు. 48మందికి పైగా ఎమ్మెల్యే లపై సీఎం ఎందుకు అసంతృప్తి గా ఉన్నారు? ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బలోపేతం అవుతుందని సీఎం భావిస్తుంటే ఆ ఎమ్మెల్యే లు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్టు ఎందుకు వ్యవహారిస్తున్నారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఎలా ఉంది? ఇది ఇప్పుడు హాట్ టాపిక్. కూటమిగా మూడు పార్టీలతో కలిసి ప్రభుత్వం సాఫీగానే సాగుతోంది. కూటమి పార్టీల మధ్య సమస్యలేవీ లేవు. కానీ అసలు సమస్య అంతా పాలనతోనే ఉందనే వాదన వినిపిస్తోంది. పైకి అంతా బాగుందని పార్టీలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం కూటమి పాలన పట్ల మరీ అంత సంతృప్తి ఏమీ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే పని ఒకటి జరుగుతోంది.
ఇటీవల సీఎం చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలలో చురుకుదనం లేదు. చాలా మంది తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడం లేదు. పెండింగ్ పనులను పట్టించుకోవట్లేదు. ప్రజలతో కనెక్టివిటీ లేదు. దాంతో ప్రజలకు కూడా ఆ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి నానాటికీ పెరిగిపోతోంది. గత వైసీపీ పాలనకూ, కూటమి పాలనకూ తేడా కనిపించకపోయే సరికి ప్రజలు ఈ ఎమ్మెల్యేలను ఎన్నుకొని ఏం లాభం అని అనుకునే పరిస్థితి వస్తోందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీలో క్రమశిక్షణపై దృష్టి సారించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం, ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా పనిచేయడం తప్పనిసరి అని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ కఠిన వైఖరి ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా వెళ్లడమే చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది.
టీడీపీ ఎమ్మెల్యేల్లో 40మందికిపైగా ఎమ్మెల్యేలు పూర్తిగా దారి తప్పారని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా వికపోవడంతో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ప్రవర్తనలో లోపాలు ఉన్న ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వారంలో ఒకరోజు సీఎం చంద్రబాబు టిడిపి కేంద్ర కార్యాలయానికి వస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు కార్యకర్తల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై టిడిపి ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు చర్చించారట. సంక్షేమం,అభివృద్ధి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్య నాయకులకి సీఎం దిశా నిర్దేశం చేశారట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదని టీడీపీ కార్యాలయంలో ఉన్న ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారట. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే ప్రజా ప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారట.
కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లట్లేదని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీని అమలు చేస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనట్లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారంట. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని టిడిపి ముఖ్య నాయకులని సీఎం చంద్రబాబు ప్రశ్నించారట.
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సరిగా పాల్గొనకపోవడం, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారంట గ్రామస్థాయి కమిటీ నుంచి రాష్ట్రస్థాయి కమిటీల వరకు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ప్రతిపాదనలు పంపించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారంట వీలైనంత త్వరలో రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులని నియమించాలని సీఎం భావిస్తున్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంటే మరోవైపు ప్రజాప్రతినిధులు వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. కమిటీలు పూర్తయ్యాక డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని నాయకులకి సూచించారట పెట్టుబడులని ఆకర్షించే విధంగా దేశ విదేశాల చుట్టూ తిరుగుతూ మంత్రులు ఎంతో కృషి చేస్తుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకి ఉందంటూ చంద్రబాబు సూచిస్తున్నారట.
కొందరు ఎమ్మెల్యేల వైఖరితో వారికి ప్రజా సేవ చేయడానికి అర్హత ఏముంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులకు మూడు నెలల పరిమితి ఉంటుంది. ఇష్యూ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు చెక్కులు పంపిణీ చేయకపోవడం వల్ల అవి తిరిగి వస్తున్నాయి . కొత్తగా చెక్కులు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది సీఎంను అసహనానికి గురి చేసింది. ఇక పనితీరు మార్చుకోకపోతే పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత ఏర్పడి అప్పుడు టీడీపీ ఓడిపోయింది.
మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై కార్యకర్తల అసంతృప్తి వల్లే టీడీపీ ఓడిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితి మరోసారి రావొద్దని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కచ్చితంగా పార్టీ లైన్ కిందే పనిచేయాలని కార్యకర్తల సమస్యలను, ప్రజల సమస్యలను తీర్చాలని ఆదేశాలు ఇస్తున్నారు. అతి త్వరలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు గట్టి యాక్షన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మరోసారి కూటమి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన.
టిడిపిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకపక్క క్యాబినెట్ సమావేశాలలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రతి జిల్లాకి ఇంఛార్జ్ మంత్రిని నియమించినప్పటికీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంలో ఎందుకు విఫలమవుతున్నారనే అంశాలపై సీఎం చంద్రబాబు నాయకుల్ని ప్రశ్నించారంట. కొత్తవారికి అవకాశం ఇచ్చినప్పటికీ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎమ్మెల్యేలపై అధినేత నిఘా వేయడం కూటమిలో హైటెన్షన్‌గా మారింది. చీమ చిటుక్కుమన్నా అధినేతకు తెలిసిపోతుండటం వల్ల చాలా మంది అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారు. ఇలా చంద్రబాబు ఎమ్మెల్యేలను అదుపు చేయడం ఎప్పుడూ ఉండేదే అయినా ఈ సారి మోతాదు ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



