Birthday Celebrations: చిరకాలం గుర్తుండేలా అలంకరణలు… ఏడాదయ్యేసరికి 12 రకాల థీమ్‌లు రెడీ
Birthday Celebrations: మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం ఏదో ఒక రకంగా కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో మనిషి ఆలోచనలను దానితోనే ముడిపెడుతున్నాడు. అయితే మనిషి తన జీవితంలో అత్యంత ఉత్సవంగా భావించేది పుట్టినరోజు. ఆ రోజును అద్భుతంగా చిత్రీకరించి వేడుకలా జరుపుకుంటారు.
పుట్టినరోజు అంటే ఏడాదికోసారి వచ్చే వేడుక. ఇది గతంలో మాట అంటున్నారు నేటి యువ తల్లిదండ్రులు. ఆధునిక ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాతి నెల నుంచే పుట్టినరోజు వేడుకలు చేస్తూ సంబరపడిపోతున్నారు.
ఈ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనవాళ్లు అక్కడ ఎక్కువ మంది ఉండటంతో ఆ దేశాల్లోని పద్ధతులను ఇక్కడా పాటిస్తున్నారు. జన్మించినప్పటి నుంచి మొదటి పుట్టినరోజు తేదీ వచ్చే వరకు ప్రతి నెలా వేడుకలు జరుపుకొంటున్నారు. ఇందుకు వైవిధ్యమైన థీమ్‌లను ఎంచుకుంటున్నారు. వాటికి అనుగుణంగా పిల్లలను అలంకరిస్తున్నారు. ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుని దాచుకుంటున్నారు.
చిరకాలం గుర్తుండేలా.. ప్రతి నెలా అలంకరించి తీసుకుంటున్న ఫొటోలు ఏడాదయ్యే సరికి 12 రకాల థీమ్‌ల ఫొటోలతో ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తున్నారు. వాటిని మొదటి ఏడాది పుట్టిన రోజున ప్రదర్శించి బంధు మిత్రులకు పంపుతూ మురిసిపోతున్నారు. ఇంకొందరు ఆల్బమ్‌లు తయారు చేసి భద్రపరచుకుంటున్నారు.
ప్రస్తుత యువ తల్లిదండ్రులకు చిన్నప్పుడు తామెలా ఉన్నామో చూసుకోలేకపోతున్నామనే అసంతృప్తి ఉంది. అప్పట్లో కెమెరాలున్నా, సెల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. తాము కోల్పోయిన సంతోషాలను.. పిల్లల్లో చూసుకుంటూ ఆనందపడుతున్నారు. అందుకే వారికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని చిరకాలం గుర్తుండేలా చేస్తున్నారు. కొంతమంది ఖర్చుకు వెనకాడకుండా వైభవంగా చేస్తుంటే.. మరికొందరు ఉన్నంతలో జరుపుకుంటున్నారు.