తెలంగాణ

కమలంలో కత్తులు.. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్

Bandi Sanjay VS Etela Rajender: కాషాయ పార్టీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా..? అప్పట్లో ఆయన చక్రం తిప్పితే.. ఇప్పుడు ఈయన పావులు కదిపారా..? ఇంతకూ ఆ నేతలు ఎవరు..? ఇద్దరు లీడర్ల మధ్య పంచాయితీ ఎక్కడ మొదలైంది..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న సామెత కరీంనగర్ కాషాయ నేతలకు సరిగ్గా సరిపోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు రాష్ట్ర మాజీ మంత్రి ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీ పార్లమెంట్ సభ్యులు. ఇప్పటికే మీకు ఆ పంచాయతీ ఎవరి మధ్య అనేది అర్ధం అయ్యిందనుకుంట అదేనండి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పోరు బీజేపీలో అగ్గి రాజేస్తోందట. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది.

బండి సంజయ్​, ఈటల రాజేందర్​ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్​ ఉన్నట్లు పొలిటికల్​ సర్కిల్​లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి అర్ధాంతరంగా దించేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారని బండి సంజయ్ వర్గం మొదటి నుంచి ఆరోపిస్తోంది. బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది కమలం పార్టీ. అప్పటి నుంచి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తోందన్న టాక్ ఉంది.

ఇక తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్ కారణమని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక సమయంలో చివరి వరకు ఈటల రాజేందర్ పేరు వినిపించింది. ఈటల రాజేందర్ కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈటలకు ప్రెసిడెంట్ పదవి రాకుండా బండి సంజయ్ తెర వెనుక పావులు కదిపారని దాంతో పార్టీ విద్యార్థి నాయకుడిగా పనిచేసిన రాంచందర్ రావుకు పదవి దక్కిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు.

ఇటీవల బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈటల గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ గ్రూపు రాజకీయాల గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మెజారిటీ తగ్గించేందుకు కొందరు పని చేశారని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అని ప్రశ్నించారు.

పార్టీని నమ్ముకుని పని చేసిన వారికే పదవులు వస్తాయని వ్యక్తులు కేంద్రంగా పని చేస్తే పదవులు రావన్నారు. ఆ వర్గం, ఈ వర్గం అని కాకుండా అందరూ మోడీ వర్గంగా పని చేయాలని ఈటల వర్గాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు. అంతేకాదు ఆ కార్యక్రమానికి హుజూరాబాద్‌లోని ఈటల వర్గానికి పిలుపే అందలేదట.

బండి సంజయ్ వ్యాఖ్యలతో ఈటల వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ఈటల రాజేందర్‌ను కలసిన హుజురాబాద్ నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉండదా..! అని మొరపెట్టుకున్నారట. దీంతో ఈటల రాజేందర్ బండి సంజయ్‌ను ఉద్దేశిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. నేను కొట్లాడితే వీరులతో, ధీరులతో కొట్లాడతా కానీ ఇలాంటి వాళ్లతో కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కారం తనది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి తన వార్డు సభ్యులు, తన సర్పంచ్‌లు ఉంటారని చెప్పారు. ఈటల కామెంట్స్ బండి సంజయ్ నుద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు కీలక నేతలు ఒకరి పేరు ఒకరు ప్రస్తావించకపోయినా వీరి మధ్య పంచాయితీ స్పష్టం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈటల, బండి సంజయ్ విషయంలో గత కొంత కాలంగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కబోతుందన్న టాక్ బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ అధిష్టానం రామచందర్ రావు పేరును ఖరారు చేసింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అయింది. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాజీనామా చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈటలకు అధ్యక్ష పదవి దక్కి ఉంటే పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చేదని ఆయన వర్గీయులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో హుజూరాబాద్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట. అసలే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి సమయంలో ఈటల, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరుతో బీజేపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోందట.

రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయితీలు ఆ పార్టీ హైకమాండ్​కు తలనొప్పిగా మారాయట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో.. ఇంతలోనే మరో పంచాయితీ తెరమీదికి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వీరిద్దరి వ్యవహారం పార్టీ కేడర్​ను అయోమయానికి గురి చేస్తోంది.

లోకల్ బాడీ ఎన్నికల టైమ్ దగ్గరపడ్తున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయితీ కలవరపెడుతోంది. ఆ ఇద్దరు నేతలు ఆధిపత్య పోరు పక్కన పెట్టి పని చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఇదే విధంగా ముందుకెళ్తే మాత్రం పార్టీ వీక్ అవుతుందని క్యాడర్ ఆందోళన పడుతోందట. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్​ ఫోకస్ చేసిందట.

త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగనుండగా ఇలాంటి టైమ్​లో ఇద్దరు కీలక నేతల నడుమ కోల్డ్​ వార్​ బీజేపీ కేడర్​ను కలవరపెడుతోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వివాదం ఇలాగే కొనసాగితే రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ కాషాయ నేతల పోరు ఎంతవరకు వెళ్తుంది ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందన్నది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button