Lobo: టీవీ నటుడు లోబోకు జైలు శిక్ష

Lobo: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతితో పాటు పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయనకు శిక్షను విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళితే… 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం వేయిస్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది.
ఈ క్రమంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12వేల 500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు అధికారులు తెలిపారు.



