AP News: గాడిద పాలకు భలే డిమాండ్..

AP News: మీకు దగ్గు, ఆయసం, నిమ్ము లాంటి ఉన్నాయా ? ఆరోగ్యం, అందం మీ సొంతం కావాలా ? అయితే గాడిదపాలు తాగండి. అవును నిజమే.. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఏపీలో గాడిద పాలను సేవించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అసలు గాడిద పాలతో వచ్చే లాభాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొందరు గాడిదలను మాంసం కోసమే పెంచుతారు అని తెలుసు. కానీ ఇప్పుడు చాలా మంది ప్రజల్లో గాడిద పాల పట్ల అవగాహన కలుగుతోంది. దీంతో గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు అక్కడే పాలను పిండి ఇస్తున్నారు. గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని ముఖ్యంగా శీతాకాలంలో ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటి నిరోధించడానికి గాడిదపాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలంగా నమ్మకం ఉంది. శీతాకాలంలో వచ్చే వైరస్ నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీంతో చలికాలం వచ్చిన నాలుగు నెలల పాటు గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.
గాడిద పాలకు డిమాండ్‌తో పాటు ధర సైతం ఎక్కువే. ఒక చిన్న టీ కప్పు సైజులో ఉండే గాడిద పాలు ధర100. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే 7000 రూపాయల వరకు ఖర్చవుతోంది. గాడిదను పెంచడానికి.. పోషించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చవడంతోనే గాడిద పాల ధర కూడా అధికంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కొక్క గాడిద రోజుకు అర లీటర్ నుంచి లీటర్ వరకు మాత్రమే పాలిస్తుంది. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తారని అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో A విటమిన్, బి1, బి5, బి6, పాటు ఫోలిక్ ఆమ్లం ఉండటంతోనే వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు.
ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా చాలామంది గాడిదలను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలను పిండి ఇన్నారు. పొద్దున్నే లేవగానే వచ్చి పాలను అక్కడే పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నామంటున్నారు. ఇంటి ముందుకే వచ్చి గాడిద పాలు పిండి ఇవ్వడంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు.
విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో నాలుగు నెలల పాటు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తామని.. తెలంగాణ నుంచి వచ్చిన వ్యాపారులు అంటున్నారు. సీజన్ లో గాడిద పాలు రెగ్యులర్ గా దొరకడం కష్టమన్నారు. ఆవు పాలు, గేద పాలు లాంటివి సాధారణంగా మనకి ఎక్కడ కావాలన్నా మార్కెట్లలో లేదా ఫామ్ నుంచి నేరుగా తెచ్చుకోవచ్చు. కానీ గాడిదని పెంచే వారి సంఖ్య చాలా తక్కువ. గాడిదలకు ఫాంలు కూడా తక్కువగా ఉండటంతో.. గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.