ఆంధ్ర ప్రదేశ్

త్వరలోనే ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ

ఏపీ క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఎవరిపై వేటు పడుతుంది మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఏపీ మంత్రివర్గంలో వేటు పడేది ఎవరిపై చోటు దక్కేది ఎవరికి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

త్వరలోనే ఏపీ క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి యేడాది పూర్తైంది. ఈ 13 నెలల కాలంలో కొందరు మంత్రుల పని తీరుతో సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. వారి పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు. అయితే ఆ మంత్రుల పనితీరుతో మార్పు లేకపోవడంతో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారట.

శ్రావణ మాసంలోని శుభ సమయంలో ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆగస్ట్ 8 నుంచి 15 మధ్య మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరులో లోపంతో పాటు మారుతున్న రాజకీయ సమీకరణాలు, కూటమి భాగస్వాముల డిమాండ్లను కూడా సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకోనున్నారు. ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రుల‌ను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే శాఖల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేనకు మరో మంత్రిపదవిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అడుగుతున్నట్లు సమాచారం. ఓ వేళ నాగబాబు కాకపోయినా ఉత్తరాంధ్రకు చెందిన నేతకైనా మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన నుంచి ఉన్న మంత్రి దుర్గేశ్‌ను తొలగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆయన స్థానంలో కొణతాల రామకృష్ణ లేదా నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయట.

మరోవైపు బీజేపీ కూడా మరో మంత్రి పదవి కోరుతోందట. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో కూటమిని బలోపేతం చేయాలని భాగస్వామ్య పార్టీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఆయన స్థానంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉపసభాపతిగా నియమితులయ్యే అవకాశం ఉందట.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ.. పల్లా శ్రీనివాస్ రావు, కళా వెంకటరావులను కేబినెట్‌లోకి తీసుకునే యోచనలో ఉన్నారట. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కూడా తొలగించే అవకాశం ఉందని సమాచారం. నెల్లూరు జిల్లాలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ప్ర‌శాంతి రెడ్డి, వెంకటరాజును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందట.

రాయలసీమ ప్రాంతంలో ఓ మంత్రికి బదులుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి‌ని కేబినెట్‌లోకి తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో మంత్రిని కూడా తొలగించనున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ జిల్లా పర్యటనల సమయంలో కొంతమంది మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. వారిపై కూడా వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. వారి స్థానంలో సమర్దులైన వారిని కేబినెట్‌లోకి తీసుకోనున్నారనే చర్చ జరుగుతోంది.

మొత్తానికి సామాజిక, ప్రాంతీయ సమతుల్యత సాధించే దిశగా ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్గతంగా పార్టీలో కూడా కీలక మార్పులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో ఎవరిపై వేటు పడుతుంది. ఎవరికి అవకాశం దక్కుతుందో తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button