శ్రీవారి అన్నప్రసాదం పై అంబటి రాంబాబు ప్రశంసలు

తిరుమలలో అన్నప్రసాదం ఎంతో రుచిగా, శుచిగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కితాబిచ్చారు. రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయన అక్కడి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో సాధారణ రోజుల్లో రోజుకు 90 వేల మంది అన్నప్రసాదం తీసుకుంటారు. ఇక ఉత్సవాలు జరిగే రోజుల్లో లక్షా 30 వేల మంది వరకు భోజన ప్రసాదం స్వీకరిస్తారు.
ఇంత మందికి ఎంతో రుచితో పాటు శుచిగా భోజన ప్రసా దాన్ని అందించటం ఎలా సాధ్యపడుతోందో ఆశ్చర్యంగా ఉందని అంబటి అన్నారు. అంబటి ప్రశంసలపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గత వైసీపీ హయాంలో కంటే ఇప్పుడు టీటీడీలో సమూలమార్పులు వచ్చాయంటూ కూటమి నేతలు అంబటి విడుదల చేసిన క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంబటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి.



