Wyra Reservoir: వైరా రిజర్వాయర్ లో తగ్గిన నీటి మట్టం

Wyra Reservoir: ఖమ్మం వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13.3 అడుగులకు తగ్గిపోయింది. ఐదు అడుగుల నీటిమట్టం తగ్గడంతో రబీలో పంటల సాగుతో పాటు మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీటి సరఫరాపై కూడా దీని ప్రభావం పడనుంది. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ కు సాగర్ జలాలు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 28 వరకు రబీ సాగుకు షెడ్యూల్ ప్రకటించింది. వార బందీ విధానంలో నీటి సరఫరా జరుగనుంది. దానిలో భాగంగానే వైరా రిజర్వాయర్ కుడి, ఎడమకాల్వల ఆయకట్టుకు మార్చి చివరి వరకు నీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే మాలోతు రామ్ దాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదల శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో జరిగిన సమావేశంలో నిర్ణయం చేశారు. ప్రభుత్వం మాత్రం రబీలో ఏప్రిల్ 23 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీటి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రబీకి సంబందించి దాదాపు 2500 పైచిలుకు ఎకరాల్లో మొక్క జొన్న సాగుచేశారు.
అది కాకుండా విత్తనం మొక్కజొన్న కూడా వందలాది ఎకరాల్లో రైతులు వేశారు. చెరకు సాగు కూడా చేపట్టారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా మిర్చి సాగులో ఉంది. ఇకపోతే కుడి, ఎడమ కాల్వల కింద 10 నుంచి 15 వేల ఎకరాల్లో రబీ వరిని సాగు చేసేందుకు రైతులు వరి నార్లు పోశారు. ఏర్లు, వాగులు, కరెంట్ మోటర్ల ఆధారంగా ఇప్పటికే దాచాపురం, గరికపాడు, ఖానాపురం, ముసలిమడుగు, గొల్లెనపాడు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి వేశారు.
ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ నీటిమట్టం 13.3 అడుగులకు తగ్గిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనగా ఉన్నారు. ఖరీఫ్ లో సాగర్ జలాలతో నిమిత్తం లేకుండానే వర్షాధారంగానే రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా పంటలకు నీటి సరఫరా చేశారు. అయితే ఇప్పుడు నీటిమట్టం తగ్గిపోతున్నందున సాగర్ జలాల అవసరం ఏర్పడింది. ఎన్నెస్పీ 21 ఎంబీసీ పైనున్న ఎస్కేప్ లాకుల నుంచి వైరా రిజర్వాయర్ కు సాగర్ నీరు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
అనేకమంది రైతులు ఈ రబీలో దమ్ములు చేసి నేరుగా వరి విత్తనాలు చల్లుకుంటున్నారు.కొంత మంది రైతులు వరి నారుమళ్లు పోసుకున్నారు. నారుమళ్లు ఏపుగా ఎదిగే దశలో ఉన్నాయి. అందువలన సాగర్ జలాలతో వైరా రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపి రబీలో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా రిజర్వాయర్ లో కనిష్టంగా 14 అడుగుల నీటి మట్టాన్ని మిషన్ భగీరథ తాగు నీటి అవసరాల కోసం నిల్వ ఉంచాలనే నిబంధన కూడా ఉంది. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఎలాంటి మీమాంస లేకుండా సాగర్ జలాలతో రిజర్వాయర్ ను నింపాలని రైతులు కోరుతున్నారు.