తెలంగాణ
KCR: రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

KCR: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో సంక్రాంతి పండుగ వైభవంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా గ్రామాలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతికి హిందూ శాస్త్రాలు, పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉందని కేసీఆర్ తెలిపారు. తన పదేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం, రైతాంగ సంక్షేమం మళ్లీ గాడిన పడుతూ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఆకాంక్షించారు.



