Chamala: తెలంగాణ బీజేపీ లోకి కొత్త కళాకారుడు ఎంట్రీ

Chamala: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ లోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు వ్యక్తులు కేంద్రమంత్రులుగా కొనసాగుతున్నారు వీళ్లు కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
మెట్రో రెండో దశకు కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తే తప్పకుండా ప్రధాని మోడీ ఫొటో పెడతామని అన్నారు. అసలు ఇక్కడి బీజేపీ నేతలు సరైనోళ్లు అయితే తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పే ఉండేది కాదని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తే. ఒక్కొక్కటిగా తాము సరిచేసుకుంటూ వస్తున్నామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని చెప్పారు.