భారతదేశం పై విషం కక్కిన యూనస్.. బంగ్లా మ్యాప్‌లో భారత్ ఈశాన్య రాష్ట్రాలు

నవ్విపోదురు గాక నాకేమీ సిగ్గు అంటోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. ప్రజలతో ఎన్నుకోలేదు, ప్రజల ద్వారా గెలవలేదు. కానీ ఇండియాపై మాత్రం అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. చిన్న పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి, తద్వారా ఆర్థిక నిపుణుడన్న పేరు సంపాదించి, నోబెల్ అవార్డు గెలుచుకున్న మహ్మద్ యూనస్ బుద్ధేంటో… ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వాణిజ్యంతో చేతులు కాల్చుకున్న యూనస్… కక్ష రాజకీయాలతో చలికాచుకుంటున్నాడు. ఇప్పుడు మన శత్రుదేశమైన పాకిస్తాన్‌తో దోస్త్ మేరా దోస్త్ అంటోంది. ఈ క్రమంలోనే భారత్‌పై యూనస్ మరోసారి విషం కక్కారు. పాకిస్తాన్ జనరల్ షంషాద్ మీర్జాకు ఓ వివాదాస్పద మ్యాప్‌ను బహుకరించారు. ఇంతకీ యూనస్ ప్లాన్ ఏంటి..? ఆయన బహుకరించిన మ్యాప్ ఏంటి..? ఎందుకు అది వివాదాస్పదమైంది.
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన దగ్గరి నుంచి భారత్‌తో దౌత్య సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయన తాజాగా మరోసారి భారత్‌పై విషం కక్కారు. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినదిగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. ఆ మ్యాప్‌లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌లో భాగంగా చిత్రీకరించారు. ఈ చర్య ద్వారా భారత్ సార్వభౌమత్వాన్ని యూనస్ పరోక్షంగా ప్రశ్నించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యూనస్ అధికారం చేపట్టిన దగ్గరినుంచి పాక్-బంగ్లా దగ్గరవుతున్నాయి.
దీనిలో భాగంగా పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా యూనస్-మీర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్‌కు యూనస్ ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన చర్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.
ఈ భేటీ తర్వాత, యూనస్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిలో, పాక్ జనరల్‌కు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్న చిత్రం ఉంది. అయితే, ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉన్న మ్యాప్‌లో భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో కలిపి చూపించారు. ఇది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థలు కోరుతున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ వాదనకు బలం చేకూర్చేలా ఉంది.
ఈ ఫొటో బయటకు రావడంతో సోషల్ మీడియాలో యూనస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనవసరంగా భారత్ అంతర్గత విషయాల్లోకి ప్రవేశిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. 1971 విమోచన యుద్ధం తర్వాత చారిత్రాత్మకంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ సంబంధాలు, యూనస్ అధికారంలోకి వచ్చాక మెరుగుపడుతున్నాయనడానికి ఈ భేటీ నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగ సహకారం వంటి పలు అంశాలపై చర్చ జరిగిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ జనరల్ మిర్జా పలు రంగాల్లో సహకారం బలోపేతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తమ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు.
కాగా ఇప్పటికే కరాచీ-చిట్టగాంగ్ మధ్య నౌకా రవాణా ప్రారంభమైందని, త్వరలో ఢాకా-కరాచీ మధ్య వైమానిక రవాణా కూడా ప్రారంభం కానుందని తెలిపారు. ఇక వెస్ట్ ఆసియా పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించారు. ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరముందని ఉభయ పక్షాలు అభిప్రాయపడ్డాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి, ప్రాంతీయ అస్థిరత కలిగించే గెరిల్లా గుంపుల పాత్రపై కూడా చర్చ జరిగింది.
మన ఈశాన్య ప్రాంతంపై యూనస్ అక్కసు వెళ్లగక్కడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన సందర్భంగా భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యలు చేశారు. మరో సందర్భంలో.. బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు.
అయితే వాటికి అప్పట్లోనే భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టి బదులు ఇచ్చారు.
కాగా షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయిన నేపథ్యంలో యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢాకా భారత దేశానికి దూరమై పాకిస్థాన్ వైపు మొగ్గుచూపుతోందనే అభిప్రాయం బలపడుతోంది. రెండు దేశాల మధ్య వీసా రహిత ప్రయాణ ఒప్పందం, ప్రభుత్వ, రాయబారి పాస్‌పోర్ట్ హోల్డర్లకు ప్రయోజనాలు, విద్యార్థులకు పాకిస్థాన్ ఇచ్చిన 500స్కాలర్షిప్లు ఈ కొత్త దిశకు నిదర్శనం.
అదే కాకుండా, 2018 తర్వాత నిలిచిపోయిన ఢాకా-కరాచీ నేరుగా విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సముద్ర మార్గంలోనూ ఇరుదేశాలు 47 సంవత్సరాల తర్వాత నేరుగా వాణిజ్య రవాణా తిరిగి ప్రారంభించాయి. గత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పాకిస్థాన్ ఉత్పత్తుల దిగుమతులపై ఉన్న పరిమితులు తొలగించింది. ఇంతకుముందు పాకిస్థాన్ నుండి వచ్చే సరుకులు మూడు దేశాల నౌకల ద్వారా మాత్రమే చేరేవి.
ఈ పరిణామాలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల తెలిపినట్లు.. చైనా-పాకిస్థాన్-బంగ్లాదేశ్ అనుసంధానం భారత్ భద్రతకు కొత్త సవాళ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు విస్తారమైనది. స్మగ్లింగ్, మిలిటెన్సీ పెరిగే ప్రమాదం ఉందని భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2004లో అస్సాం వద్ద చైనా తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న ఘటనను కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆ కుట్ర వెనుక పాకిస్థాన్ ISI ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా యూనస్ పాకిస్థాన్ జనరల్‌కు అందించిన మ్యాప్‌లో అస్సాం,ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించడం భారత్‌లో ఆగ్రహం రేపింది.
ఇంతకు ముందు చైనాలో ఆయన చేసిన ప్రకటనలతో కూడా ఢిల్లీ అసహనం వ్యక్తం చేసింది. నిపుణులు చెబుతున్న దానిభట్టి ఢాకా-ఇస్లామాబాద్ రక్షణ సహకారం పెరిగితే భారత్‌కు పశ్చిమ, తూర్పు సరిహద్దుల వద్ద కూడా ప్రత్యర్థి శక్తులు బలపడే ప్రమాదం ఉంది. ఇది భారత్ ప్రభావాన్ని దక్షిణాసియాలో తగ్గించి, బే ఆఫ్ బెంగాల్, ఈశాన్య ప్రాంతంలో అస్థిరతకు దారితీయవచ్చు. ప్రస్తుతం యూనస్ విధానాలతో బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాలు ఏకీభవించడం లేదు. పాకిస్థాన్‌పై అనుమానం వ్యక్తం చేసే పెద్ద వర్గం దేశంలో ఉంది. అయినప్పటికీ, ఈ పరిస్థితులు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాల్సి ఉంది.
ఇక బంగ్లాదేశ్ వస్తువులు భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్‌లకు వెళ్లేందుకు వీలు కల్పించే రవాణా ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీనికితోడు, యూనస్ సన్నిహితులు కూడా గతంలో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం, భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటివి చేశారు. వరుస ఘటనలపై యూనస్ మౌనంగా ఉండటం, ఇప్పుడు స్వయంగా వివాదాస్పద మ్యాప్‌ను బహుమతిగా ఇవ్వడం చూస్తుంటే.. చైనా, పాకిస్థాన్‌ల మద్దతుతో ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.



