YS Sharmila Son: వైఎస్సార్ మనవడు రాజా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ

YS Sharmila Son: ఆంధ్రప్రదేశ్ హాట్ హాట్ పాలిటిక్స్ కు వేదిక కానుందా…….ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరలేవబోతుందా……ఇప్పటి వరకు అన్నా, చెల్లెలు మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ మరో టర్న్ తీసుకోబోతుందా….అది కాస్త మామ,అల్లుళ్ల సవాల్ కి దారితీస్తుందా… ఇదే డిస్కషన్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది…దీనికి కారణం రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ రావడమే…ఇంతకు ఎవరా రాజారెడ్డి….ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మారే రాజకీయం ఏంటి….ఆయన పొలిటికల్ ఎంట్రీ మామ అల్లుళ్ల రాజకీయ పోరుకు ఎందుకు , ఎలా దారితీస్తుంది…ఓసారి చూద్దాం.
దేశ,రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు తమ పిల్లలకు రాజకీయ వారస్వతం ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇలా రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, చాలా మంది మంత్రులుగా పని చేసిన వారు ఉన్నారు. తాజాగా ఏపీలో పిసిసి అధ్యకురాలు షర్మిల తనయుడు రాజా రెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం నుంచి చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా పని చేశారు.
ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి విభజిత ఏపీకి సీఎంగా పని చేశారు.ప్రస్తుతం వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి మద్దతుగా షర్మిల కర్నూల్లో పర్యటించారు. ఈ పర్యటనలో షర్మిల తనయుడు రాజారెడ్డి కూడా మొదటి సారి పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వైఎస్ సతీమణి విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని షర్మిల తనయుడు రాజారెడ్డి మొదటి సారి ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిలను కోరారు.
సరైన సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి రాజా రెడ్డి వస్తారు అంటూ షర్మిల కూడా స్పష్టత ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మరో యువనేత రాజకీయ అరంగ్రేటం ఖాయం అనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో ఆమె తనయుడు కూడా హస్తం పార్టీ నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు షర్మిల తనయుడు రాజకీయాల్లోకి రావచ్చు అనే ఊహాగానాలు నడుస్తున్నాయి.
షర్మిల తనయుడు రాజకీయాల్లోకి వస్తే ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సొంత అన్నా చెల్లెలు జగన్, షర్మిల చెరో పార్టీలో వున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా తల పడుతున్నారు. జగన్,షర్మిల మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉంది. అది ఎంతలా అంటే గత ఎన్నికల్లో అన్నను గద్దె దింపడం కోసం ఊరు వాడా జగన్‌కి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేశారు. ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యారు.
షర్మిల తనయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇస్తే మాత్రం అది మరో రాజకీయ పోరాటం దిశగా మారే చాన్స్ వుంటుంది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బద్ద రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసే పని చేసేందుకు ఏమాత్రం ఆలోచన కూడా చేయడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ విషయంలో అంతే వ్యతిరేకతతో వుంది. ఏపీ వరకు చూస్తే జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతటి ఫాలోయింగ్ ఉన్న నేతలు ఎవరు లేరు. షర్మిల తనయుడు హస్తం పార్టీ గూటి నుంచే రాజకీయ ఓనమాలు మొదలు పెడితే ఆ పార్టీలో కీలక యువనేతగా గుర్తింపు తెచ్చుకునే చాన్స్ ఉంది. వైఎస్ఆర్ మనవడిగా, షర్మిల తనయుడిగా, జగన్ మేనల్లుడిగా ఎలాగూ కొంత ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన వేసే రాజకీయ అడుగులు ఇంకొంత ఇమేజ్ తెచ్చి పెడతాయి.
రాజకీయాల్లోకి ఒకసారి వచ్చాక బంధుత్వాలు పనికి రావు. ఇప్పుడు షర్మిల, జగన్ విషయంలో అదే జరుగుతుంది. రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఏదో ఒక సందర్భంలో జగన్‌పై విమర్శలు చేయక తప్పదు. దానికి ఆ పార్టీ నుంచి రివర్స్ కౌంటర్ తప్పదు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే వైసీపీనీ బలహీనం చేయాలి. ఆ బాధ్యతను ఇప్పటికే షర్మిల నిర్వహిస్తున్నారు.ఆమెకి తనయుడు కూడా తోడు అయితే వైసీపీనే వారికి టార్గెట్‌గా మారక తప్పదు. ఈ లెక్కన రానున్న రోజుల్లో మామ అల్లుళ్ల సవాల్‌కి ఏపీ వేదికగా మారే చాన్స్ వుంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం జగన్ మోహన్ రెడ్డివి ఆయన తాత రాజారెడ్డి పోకడలు అని విమర్శిస్తుంటారు. వైసీపీ అధికారంలో ఉన్ననాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడపా దడపా జగన్, ఆయన తాత రాజారెడ్డి ప్లకార్డులతో హడావిడి చేయడం చూస్తూనే ఉంటాం.
జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు అమ్మాయిలే కావడంతో షర్మిల తనయుడికి రాజారెడ్డి పేరు పెట్టారు. ఒక దశలో జగన్ వారసుడిగా ఆయన మేనల్లుడు రాజా రెడ్డే అనే ప్రచారం కూడా బాగానే జరిగింది. అయితే ఆ తరువాత జగన్ ,షర్మిల మధ్య రాజకీయ విభేదాలు రావడంతో ప్రస్తుతం ఉప్పు,నిప్పుగా మారారు. ఇప్పుడు షర్మిల తనయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం అయింది. అందులోనూ జగన్ తీవ్రంగా విభేదించే కాంగ్రెస్ పార్టీతో. దీంతో రానున్న రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ రాజారెడ్డి రాజకీయ పోరాటం తప్పదు.
అయితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం తీసుకుంటే ఆ పార్టీ తల రాత మారుతుందా అధికారం సంగతి పక్కన పెడితే కనీసం ఓ ఎమ్మెల్యే,ఎంపీ సీటు అయినా గెలుస్తుందా. ఏమో చూడాలి రానున్న రోజుల్లో మామ,అల్లుళ్ల ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఎంత వరకు ఫలిస్తాయో మరి.



