Himba: విచిత్ర సంప్రదాయం.. జీవితంలో మహిళలు ఒక్కసారే స్నానం

Himba: ఈ ప్రపంచంలో అందానికి ప్రతీకలుగా స్త్రీలను చెప్పుకుంటారు. ప్రతిరోజు స్నానం చేయడం, ముఖాన్ని నాలుగైదు సార్లు ఫేస్ వాష్‌తో రుద్దడం, క్రీములు పూయడం ఇవన్నీ అందంగా ఉండాలనుకునే ప్రతి మహిళలు చేస్తూ ఉంటారు. ఆమె కోసం ఎన్నో బ్యూటీ ఉత్పత్తులు కూడా సిద్ధమవుతున్నాయి. కానీ జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేయని మహిళలు కూడా ఈ భూమిపై ఉన్నారు. అయితే వారు చూడటానికి అంద విహీనంగా ఉంటారేమో అనుకోవచ్చు. వారు అప్సరసల్లాగా అందంగా కనిపిస్తారు. ఇంతకీ ఆ మహిళలు ఎక్కడ ఉంటారు…? వారు ఎందుకు స్నానం చేయరు..?
ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. కానీ జీవితంలో ఒక్కసారే స్నానం చేసే మహిళల గురించి ఎప్పుడైనా విన్నారా..? ఉత్తర నమీబియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఒక విచిత్రమైన తెగ ఉంది. వారి ఆచారాలు వినడానికి ఆశ్చర్యంగా, కాస్త మిస్టీరియస్‌గా ఉంటాయి. ఈ హింబా తెగ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఓ పురాతన సంప్రదాయాన్ని పాటిస్తారు. మీరు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. పాత ఆచారాలను, సాంప్రదాయాలను ఇప్పటికీ పాటించేందుకు ముందుంటారు.
హింబా తెగ నమీబియా దేశంలో ఉత్తరాన ఉన్న కునాన్ ప్రావిన్స్ లో నివసిస్తోంది. ఈ ప్రాంతం చాలా పొడిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీటి కొరత ఎక్కువ. తీవ్రమైన నీటి కొరత కారణంగా వారు స్నానానికి నీటిని వాడరు. అయినప్పటికీ అక్కడ మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. తమ సాంప్రదాయపు కట్టుబాట్లను కొనసాగిస్తారు. వీరి జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. హింబా ప్రజల్లో స్త్రీలు వారి జీవితకాలంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తారట. అదీ కూడా వారి పెళ్లి రోజున మాత్రమే. అయినా సరే, నీళ్లు వాడకుండానే వాళ్లు ఫ్రెష్‌గా, శుభ్రంగా, అందంగా కనిపిస్తారు. అయితే శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఒక వింతైన చిట్కాను పాటిస్తారు.
వారు నివసించే ప్రాంతంలో ఓమ్జుంబాజంబ్ అనే ప్రత్యేకమైన మొక్క ఉంటుంది. ఆ మొక్క ఆకులను కుప్పగా పోసి కాలుస్తారు. అలా కాలుస్తున్నప్పుడు వచ్చిన పొగని పీల్చుకుంటారు. అలాగే ఆ పొగ తమ శరీరానికి తాకేలా చేస్తారు. ఈ సహజమైన పొగ వారి శరీరాలను శుభ్రపరుస్తుంది. ఇది నేచురల్ డిస్ఇన్ఫెక్టెంట్లా పనిచేసి, బ్యాక్టీరియాను చంపుతుంది, శరీర దుర్వాసనను పోగొడుతుంది. అలాగే శరీరం నుంచి ప్రత్యేకమైన సువాసన వచ్చేలా చేస్తుంది. అంతేకాదు, మూలికలు, మొక్కలను నీటిలో మరిగించి వచ్చే ఆవిరితో ‘స్టీమ్ బాత్’ కూడా చేస్తారు.
ఇది వారి చర్మాన్ని మరింత శుద్ధి చేసి, ఆ కఠినమైన ఎడారి వాతావరణంలోనూ ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఇక ముఖానికి చేతులకు ఓటిజే అనే ఎర్రటి మట్టిని పేస్టులాగా చేసి రాసుకుంటారు. ఆ మట్టిలో జంతువుల కొవ్వును కూడా కలుపుతారు. ఇది చర్మంపై సూర్యకిరణాలు వల్ల కలిగే హానిని అడ్డుకుంటుంది. అలాగే పొడి బారే సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఆ ఎర్ర మట్టిలో ఉన్న సుగుణాలు వారి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి.
స్త్రీల జుట్టు కూడా వారి అందంలో ముఖ్యమైన భాగమే. వారి జుట్టుకు కూడా ఈ పేస్టునే రాస్తారు. ఇలా ఎర్రటి మట్టిని జుట్టుకు రాసుకున్నారంటే వారు పెళ్లయిన స్త్రీలు అని అర్థం. అలాగే వారి జుట్టుకు పూసలు వంటివి పెట్టుకుని చాలా విచిత్రమైన జడలను వేసుకుంటారు.
హింబా తెగలో ఒక విచిత్రమైన సాంప్రదాయం కూడా ఉంది. అది చాలామందికి జుగుప్సాకరమైనదే. కానీ హింబా తెగలో మాత్రం అది ఎలాంటి నేరము కాదు. ఎవరైనా తమ ఇంటికి ఆతిధ్యాన్ని స్వీకరించడానికి వస్తే.. అతడు మగ వ్యక్తి అయితే ఒక రాత్రికి ఆ అతిథితో తన భార్యను ఉంచేందుకు భర్త అనుమతి ఇస్తాడు. ఇలా చేయడం వల్ల తమ భార్య, భర్తల బంధంలో అసూయ భావం తొలగిపోతుందని వారు నమ్ముతారు.ఇది ఆ తెగలో ఏమాత్రం తప్పు కాదు.
సాధారణంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు అతని వయస్సు భూమి మీద పడినప్పటి నుండి లెక్కిస్తారు. అయితే ఈ హింబా తెగలో మాత్రం ఇది విరుద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ఒక స్త్రీ బిడ్డ పుట్టడం గురించి ఆలోచించిన క్షణం నుండి పిల్లల పుట్టిన తేదీ లెక్కించడం ప్రారంభమవుతుంది. అవును, ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ హింబా తెగలో పుట్టిన రోజు తేదీ లెక్కింపు విషయంలో ఇదే జరుగుతుంది.
ప్రపంచం అద్భుతాలు, రహస్యాలతో నిండి ఉంది. మనం వాటి గురించి ఎంత ఎక్కువగా తెలుసని అనుకుంటే అంత ఎక్కువ రహస్యాలు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక అభివృద్ధి ద్వారా తాకబడని ఇప్పటికీ అదే పురాతన మార్గాల్లో తమ జీవితాలను గడుపుతున్న గిరిజన సమాజాలు ఉన్నాయి. ఈ తెగలకు వారి స్వంత ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి మనకు పరాయివిగా అనిపించవచ్చు. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ఈ తెగలను అంతరించిపోకుండా కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.