ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో కండక్టర్‌పై గొడవకు దిగింది. పరిటాల గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కి ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదకరమని ఆమెను డ్రైవర్ హెచ్చరించారు. దీంతో ఆమె.. డ్రైవర్, కండక్టర్‌పై విరుచుకుపడింది. ‘‘నా ఫొటో తీసుకో ఈ ఫొటోను విజయవాడ సిటీ, చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లి చూపించండి.
చూడగానే పోలీసులకే దడ పుడుతుంది అంటూ దురుసుగా ప్రవర్తించింది. తోటి ప్రయాణికులు సర్దిచెప్పాలని ప్రయత్నించినా వినకుండా వారిపైనా ఎదురుదాడికి దిగింది. ఆ మహిళ పరిటాలలో దిగాల్సి ఉన్నా అక్కడ డ్రైవర్ బస్సును ఆపకుండా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.



