Visakha: నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య

Visakha: భర్తల పాలిట పెళ్లాలు యమపాశాలుగా మారుతున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తపై మరుగుతున్న నీళ్లు పోసిన సంఘటన బీచ్‌రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలివి. నేరెళ్లవలసకు చెందిన కృష్ణ అదే ప్రాంతానికి చెందిన తన మేనమామ కుమార్తె గౌతమిని ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వారి మధ్య మనస్పర్థల కారణంగా మూడేళ్లు నుంచి విడిగా ఉంటున్నారు.
తల్లిదండ్రులు ఇద్దరినీ కలపడంతో ఈ నెల 28 నుంచి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నారు. ఇదిలా ఉండగా వీరిరువురి మధ్య చిన్న తగాదా చోటు చేసుకుంది. అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త కృష్ణపై గౌతమి మరుగుతున్న వేడి నీళ్లను పోసింది. దీంతో కృష్ణ ముఖం కాలిపోయింది. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కృష్ణను కేజీహెచ్‌కు తరలించారు. కృష్ణ కుటుంబ సభ్యులు భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.