అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ రెచ్చిపోతుందా?

Israel: అమెరికా అన్నంతపని చేస్తోంది. బయటకు కనిపించకుండా తన ప్రమేయం లేకుండా చేయాల్సిన పని అంతా ఇజ్రాయిల్‌తో చేయిస్తోంది. ఇజ్రాయిల్ చుట్టూ ఉన్న అరబ్దేశాలపై దండయాత్ర చేయిస్తూ, తన మాట వినకుంటే నల్లిని నలిపినట్టు నలిపేస్తానంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తంగా పచ్చిమాసియా తగలబడిపోతుంది. మొన్న సిరియా, నినన లెబనాన్, నేడు ఇరాన్ ఇలా అడ్డం వచ్చిన వారందరినీ వేసేసుకుంటూ రెచ్చిపోతోంది.
పాలస్తీనావాసులు తిండి దొరక్క ప్రజలు అల్లల్లాడుతున్నారు. తాజాగా గల్ఫ్ దేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయిల్ దెబ్బతో ఇరాన్ కుదేలవుతోంది. నాడు జీవాయుధాలను త్యజిచాలంటూ ఇరాక్ పై దండ యాత్ర చేసిన అమెరికా, ఇప్పుడు అణ్వాయుధాలను వదులుకోవాలంటూ ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఇరాన్ అణ్వాయుధాలతో తమకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది.
దీర్ఘ శ్రేణి మిసైళ్లతో తమకు ప్రమాదం పొంచి ఉందని అగ్రరాజ్యం వర్రీగా ఉంది. దీంతో ఇరాన్ వద్ద అణ్వస్త్రాలను ధ్వంసం చేయాలని చాన్నాళ్లుగా భావిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను నేలమట్టం చేసి పనిని ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌కి అప్పగించింది.
చేతికి మట్టి అంటకుండా ఇజ్రాయిల్‌తో కాగల కార్యం చేయిస్తోంది. ఇజ్రాయెల్ దాడి తర్వాత పరిస్థితులు ఎలా మారతాయోనని గల్ఫ్ దేశాలు టెన్షన్‌కు గురవుతున్నాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. అణ్వాయుధాలతో ఇజ్రాయులకు ముప్పు ఉందని కూడా అమెరికా భావిస్తోంది. పాకిస్తాన్ తమ చెప్పు చేతల్లో ఉంటుంది.
ఉత్తర కొరియాను కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదనుకుంటోంది. అందుకే ఇరాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను నాశనం చేస్తే తమ భద్రతకు ఇక ఢోకా ఉండదనుకుంటోంది. అందుకోసం ఇజ్రాయిల్‌ను ఉసిగొల్పింది. గత కొద్ది రోజులుగా గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికన్లను తట్టాబుట్టా సర్దేసుకొని వచ్చేయాలంటూ కూడా అమెరికా హెచ్చరించింది.
ఓవైపు ఇజ్రాయెల్‌లో బెంజిమెన్ నెతన్యాహు సర్కారును సాగనంపాలని అక్కడి విపక్షాలు భావించినా, అది సాధ్యం కాలేదు. అవిశ్వాసం వీగిపోవడంతో నెతన్యాహు రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్‌పై దండయాత్ర చేస్తున్నాడు. అమెరికా మద్దతుంటే ఇక ఏం చేయడానికైనా భయపడాల్సిందేముంటుంది?
వినాశనం దిశగా ప్రపంచం పయనిస్తోందా అన్న అనుమానాలు కలిగేలా సీన్ మారిపోతోంది. పాలస్తీనాపై మెరుపు దాడులతో రేపు తమకేం జరుగుతుందోనని ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ డ్రోన్ దాడులతో రెచ్చిపోతోంది. కానీ అమెరికా టెక్నాలజీ, ఇజ్రాయెల్ మేథస్సు ముందు ఆ దేశాలు తట్టుకొని నిలబడటం కష్టం.
ఒక్కొక్కరినీ ఒక్కోలా ఇజ్రాయెల్ చేస్తుంటే, అమెరికా తానా అంటే తందానా అంటోంది. ఇరాన్ అణ్వాయుధాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ఏ దిశగా సాగుతాయన్నదానిపై ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. ప్రపంచదేశాలకు ఇరాన్ నుంచి చమురు నిల్వలు ఎంతో కీలకం. ఇప్పటికే చమురు ధరలు పెరగబోతున్నట్టు సంకేతాలున్నాయి. ఇజ్రాయెల్ దాడితో చమురు ధరలపై ప్రభావం ఉండబోతుందన్న సంకేతాలున్నాయి.
అసలు అమెరికా అండ లేకుండా ఇజ్రాయెల్ రెచ్చిపోతుందా? ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతున్న ట్రంప్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నాయ్ ప్రపంచదేశాలు. మొత్తంగా అణుయుద్ధం కలియుగాంతం దిశగా తీసుకెళ్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.