ఆంధ్ర ప్రదేశ్

Kodali Nani: గుడివాడ నియోజకవర్గంలో కొడాలి జాడేది..!

Kodali Nani: గుడివాడ నియోజకవర్గం అంటే కొడాలి నాని…కొడాలి నాని అంటే టక్కున గుర్తు వచ్చేది గుడివాడ…ఎన్టీఆర్ తరువాత గుడివాడ నుంచి ఆయన అంత ఫేమస్ అయ్యారు…కానీ కొద్ది నెలలుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు…చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు….దీంతో నియోజక వర్గ వైసీపీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయారు….సెకండ్ గ్రేడ్ లీడర్లతోనే పార్టీని నెట్టుకు వస్తుంది క్యాడర్….ఇదిగో నాని వస్తున్నాడు..అదిగో నాని వస్తున్నాడు అంటూ ప్రకటనలే తప్ప….ఆయన మాత్రం యాక్షన్ లోకి రావడం లేదు…..దీంతో నియోజక వర్గ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది… ఇంతకీ గుడివాడ నియోజక వర్గానికి నాని ఎందుకు దూరంగా ఉంటున్నారు…కేసుల భయమా…..ఆరోగ్య సమస్యలా….ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత 1983లో మొదటి సారి ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో టీడీపీనీ అధికారంలోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ స్పూర్తితో కొడాలి నాని గుడివాడ నియోజక వర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ తరుపున రెండుసార్లు ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ఆ తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

2014,2019 ఎన్నికల్లో వైసిపి నుంచి వరుసగా కొడాలి నాని గుడివాడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. అంతేకాదు జగన్ మొదటి విడత కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు. 2024 ఎన్నికల్లో మూడో సారి వైసీపీ నుంచి నాని పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో కొడాలి నాని టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి తరువాత నాని రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన గుడివాడ నియోజక వర్గానికి గెస్ట్ గా మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు.

గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు,మాజీ మంత్రులను టార్గెట్ చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం లక్ష్యంగా చేసిన కామెంట్స్, అవినీతి కార్యక్రమాలపై దృష్టిపెట్టింది. ఎన్నికల ముందే నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేతలు చేసిన పనులను అన్నిటిని నోట్ చేసుకున్నట్లు చెప్పారు.అంతేకాదు అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు.లోకేష్ చెప్పినట్లే కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్న వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు కొడాలి నాని కూడా రెడ్ బుక్ లో ముందు వరుసలో ఉన్నారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక కొడాలి నాని మిత్రుడు వల్లభనేని వంశీని ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపింది. నెక్ట్స్ టార్గెట్ కొడాలి నానినే అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దీంతో కొడాలి నాని కూడా ఎన్నికల్లో ఓటమి తరువాత గుడివాడ నియోజక వర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ క్యాడర్ లక్ష్యంగా కేసులు పెడుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్కి నియోజక వర్గ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు అండగా ఉంటున్నారు. అయితే గుడివాడలో మాత్రం పరిస్తితి ఇందుకు భిన్నంగా ఉంది.ఐదు ఎన్నికల్లో అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులకు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గుడివాడ నియోజక వర్గంలో ఇబ్బందుల్లో ఉన్న క్యాడర్ నీ పట్టించుకోవాల్సిన మాజీమంత్రి హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు.

నియోజక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, లేదంటే పక్క నియోజక వర్గ నేతలతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కొడాలి నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా ఎప్పుడూ నియోజక వర్గ క్యాడర్ కి దూరంగా లేరు. కానీ ఈసారి మాత్రం ఆయన దాదాపుగా ఏడాదిన్నరగా క్యాడర్ కి దూరంగా వుంటున్నారు. తనపై నమోదు అయిన కేసులకు సంబంధించి పోలీసు స్టేషన్లో సంతకాలు పెట్టడానికి మాత్రమే వస్తున్నారు నాని.

కొడాలి నాని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దూకుడుగా రాజకీయాలు చేస్తారు. ప్రత్యర్థి పార్టీ నేతలను తన మాటలతోనే చిత్రవధ చేస్తారు. ఈ దూకుడుకి అధికారం కూడా తోడు అయితే ఆయన స్పీడ్ కి బ్రేకులు ఉండవు. గత ఐదేళ్లు అధికార పార్టీ మంత్రిగా ,ఎమ్మెల్యేగా అంతే బ్రేకులు లేని బుల్లెట్ లా చంద్రబాబు,పవన్ కల్యాణ్ , లోకేష్ ల పై తీవ్ర విమర్శలు చేశారు. అవి కాస్త శృతి మించడంతో బూతుల మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

అప్పట్లో ఆయన దూకుడే ఇప్పుడు ప్రతి బంధకంగా మారింది. అది ఎంతలా అంటే కనీసం నియోజక వర్గంలో అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది పడేవరకు వెళ్ళింది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో రాజకీయాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యల తరువాత త్వరలోనే ఆయన మళ్ళీ గుడివాడలో రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు అంటూ ఆ మధ్య కాలంలో మాజీమంత్రి పేర్ని నాని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పి కూడా రెండు నెలలు కావొస్తుంది.కానీ కొడాలి మాత్రం ఇంకా గుడివాడ నియోజక వర్గంపై ఫోకస్ పెట్టడం లేదు.

కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అయింది. ప్రభుత్వ వైఫల్యాలపై అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలంతా ఉద్యమ బాట పట్టారు. ఒక్క గుడివాడ నియోజక వర్గంలో మాత్రమే నాయకుడు అందుబాటులో ఉండటం లేదు. రానున్న రోజుల్లో అయినా కొడాలి నాని బయటకు వస్తారో…లేదంటే ఈ మూడున్నర ఏళ్ళు ఇలాగే కాలం వెళ్లదీస్తరో వేచి చూడాలి మరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button