తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్

ఏపీ, తెలంగాణ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. ఈ సారి బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. అయితే ఈ జల జగడంపై బీజేపీ మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ బనకచర్లపై బీజేపీ స్టాండ్ ఏంటి..? ఏపీని సమర్ధిస్తుందా..? తెలంగాణకు మద్దతిస్తుందా..? లేదంటే గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుందా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాలపై మరోసారి వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధం చేయడంతో జల జగడం ముదురుతోంది. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బనకచర్ల ఇష్యూతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
బనకచర్ల పాపం మీదంటే మీదని ఒకదానిపై ఒకటి ధ్వజమెత్తుకుంటున్నాయి. అయితే ఈ ఘర్షణ మధ్యలో మౌనంగా గోడ మీద పిల్లిలా, రాజకీయ లబ్ధికోసం వేచి చూస్తోంది బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉండి, ఏపీలో చంద్రబాబు కూటమిలో భాగస్వామిగా ఉన్న కమలం పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో స్పష్టమైన మాట ఎత్తకుండా, రెండు పడవలపై కాలు పెడుతోంది. ఈ సమయంలో బీజేపీ నాయకులు చెప్పే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం అనే మాట రెండు రాష్ట్రాల్లోనూ అయోమయానికి కారణమవుతోంది.
పిట్టపోరు, పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్న సామెతను గుర్తు చేసే విధంగా బీజేపీ వైఖరి కనిపిస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కారు బనకచర్ల ప్రాజెక్టును కట్టాలని వేసిన ప్లాన్‌తో తెలంగాణ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. రేవంత్ సర్కార్ అసమర్ధత వల్లే తెలంగాణ జలాలను చంద్రబాబు దోచుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే కేసీఆర్ హయాంలోనే ఏపీకి తెలంగాణ నీటి హక్కుల్ని ధారాదత్తం చేశారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసి బీజేపీ పండగ చేసుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటూ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ బనకచర్ల విషయంలో తన వైఖరి ఏంటో చెప్పకుండా గోడ మీద పిల్లి చందంగా వ్యవహరిస్తోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీ బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందా అని ప్రశ్నిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చాలా లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోలేమన్నది ఆయన సమాధానం. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలా కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం అంటూ తనదైన శైలిలో జవాబు చెప్పి ఎస్కేప్ అయ్యారు.
బనకచర్ల విషయంలో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. పోలవరం ప్రాజెక్టు టీడీపీకి కాసుల వర్షం కురిపించిందని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ బీజేపీపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. విమర్శలు గుప్పించడంపై చూపిన శ్రద్ధ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాన్ని పరిష్కరించడంపై ఎందుకు చూపడం లేదని నిలదీస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంటే దాని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.
తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం ఈ విషయంలో బీజేపీ వైఖరిపై స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్రంలో బీజేపీ అండ చూసుకునే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమర్శిస్తున్నా తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీని ఆటలో అరటి పండుగానే చూస్తున్నారని కమలనాథులు ధీమాతో ఉన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుని బనకచర్ల ఎపిసోడ్లో ఎవరు విలన్ అనే విషయం తేలిన తర్వాత చివర్లో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలన్న దాటవేత ధోరణిని బీజేపీ అనుసరిస్తోంది. బనకచర్ల వివాదంలో మోదీ సర్కార్ కేవలం ఫెసిలిటేటర్‌గానే వ్యవహరిస్తుందని అంతకంటే మించి ఎక్కువ ఊహించుకోవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్లతో కాంగ్రెస్ పార్టీకి కొత్త అస్త్రం దొరికినట్లైంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా అని చెప్పలేని స్ధితిలో ఉన్నప్పుడు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఎలా ఉంటుందని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ కేసీఆరే అయినప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా కిషన్ రెడ్డిపై బాణాలు సంధిస్తూనే ఉన్నారు.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి పట్టించుకోకుండా టైంపాస్ చేస్తున్నారని రేవంత్ బహిరంగ విమర్శలు చేయడం బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అంటూ కమలం పార్టీ నేతలు కాలర్ ఎగరేస్తే సరిపోదని తెలంగాణ సెంటిమెంట్ తారాస్ధాయికి చేరిన తరుణంలో బనకచర్లను అడ్డుకుని తీరుతామనే మాట బీజేపీ నేతల నోట్లో వస్తే తప్ప ఆ పార్టీని తెలంగాణ జనం విశ్వసించరని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి బనకచర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోట్లాడుకుంటుంటే బీజేపీ మాత్రం చోద్యం చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా బనకచర్ల ప్రాజెక్టుపై బీజేపీ స్టాండ్ చెప్తుందా లేదంటే ఇలానే కాలం వెల్లదీస్తుందా వేచి చూడాలి.