Viral Fevers: విజృంభిస్తున్న విషజ్వరాలు… పడకేసిన పల్లెలు..
ఆ జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పల్లెల్లో విషజ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా… జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. ప్రతి ఇంటిని వైరల్ ఫీవర్స్ వెంటాడుతోన్న… ప్రభుత్వ వైద్యులు, ANMలు మాత్రం కంటికి కూడా కానరావడం లేదు. దీంతో.. PHCల కంటే RMPల మెడికల్ షాపుల వద్దే రోగులు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల భారిగా పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ ఎక్కడ అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నెల్లూరు జిల్లా పల్లెల్లో వైరల్ ఫీవర్స్ విలయ తాండవం సృష్టిస్తున్నాయి. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు జ్వరంతో మంచానికి పరిమితం అవుతున్నారు. దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, జ్వరం లక్షణాలతో పల్లెటూర్లు పడకేశాయి. గ్రామాల్లో ఏఎన్ఎం, సచివాలయ ఏఎన్ఎం,హెల్త్ అసిస్టెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇన్ని వ్యవస్థలు ఉన్నా.. ప్రజల వైపు కన్నెత్తి చూసే నాధుడే కరువయ్యాడు. గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరిచి పరిసరాలను శుభ్రపరిచి అవగాహన కల్పించాల్సిన సిబ్బంది.. మొక్కుబడిగా వచ్చి పోవడం తప్ప వరగబెట్టిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు. గ్రామాల్లోని సాధారణ RMPలు రోజుకి 100 మంది రోగుల OP చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. PHC లలో ఓపి రెండంకెలు దాటడం కూడా కష్టంగానే ఉందట. డాక్టర్లు పని వేళలు సరిగా పాటించకపోవడం.. ఇచ్చే మందుల్లో నాణ్యత లేకపోవడంతో ప్రజలు RMP లను మందుల షాపుల పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు గ్రామస్తులు.
ఏదైనా విపత్తు సంభవిస్తేనే అధికారులు స్పందించే పరిస్థితులు వచ్చాయన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ ప్రబలకుండా నియంత్రించాల్సిన వ్యవస్థలు ఇప్పటికీ మొద్దు నిద్రలోనే విడడం లేదు. నీటి నిల్వలను గుర్తించి దోమలు ప్రబలకుండా చూడడం, పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించడం చేయాల్సిన వైద్య సిబ్బంది.. నామమాత్రపు పనితీరు ప్రజలకు శాపంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పారిశుధ్యం, వైద్య ఆరోగ్య సచివాలయాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెడితే తప్ప పల్లెలు విష జ్వరాల నుండి కోలుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు అంటున్నారు
ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ దివాస్‌కు పిలుపునిస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు నీరుగారిపోతున్నాయి. ప్రకటనలకు తప్ప స్వచ్ఛ ఆంధ్ర సంకల్పం జరగాలంటే క్షేత్రస్థాయిలో వ్యవస్థలన్నీ నడుం బిగించాలి. ప్రమాణాలు చేస్తున్నారు తప్ప పనిచేయటం లేదు అనేందుకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి ఘటనలే నేడు పల్లెటూర్లలో విష జ్వరాల విలయ తాండవానికి మూలాలుగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.
విషజ్వరాలు పెరుగుతున్నా… అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో… ఫీవర్స్‌తో ప్రజలు మంచం పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విష జ్వరాలతో పడకేసిన పల్లెటూర్లలో ప్రజలకు అండగా నిలవాలని కోరుతున్నారు