Vijayashanti: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ కాదు.. జై తెలంగాణ’ ఆనండి

Vijayashanti: తెలంగాణలో మరోసారి జైతెలంగాణ నినాదం మార్మోగుతోంది. పిడికిలి బిగించి మరీ నేతలు జైతెలంగాణ అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు జైతెలంగాణ నినాదాన్ని ఎత్తుకోగా తాజాగా కాంగ్రెస్ నేతలూ జైతెలంగాణ అని నినదిస్తున్నారు. తాజా రాములమ్మ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో కలకలం సృష్టించాయి. ఇంతకూ రాములమ్మ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని హెచ్చరించారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జైతెలంగాణ నినాదం కనుమరుగవుతోందంటూ బీఆర్ఎస్ కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తామంటూ బీఆర్ఎస్ వాదిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సైతం పరోక్షంగా ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా కామెంట్స్ చేశారని గాంధీభవన్‌లో చర్చ మొదలైంది.
ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. ఇప్పుడు జైతెలంగాణ అనే నినాదం మరుగున పడటం శోచనీయమని రాములమ్మ చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకీ విజయశాంతి ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జైతెలంగాణ అనడానికి ఎవరు విముఖంగా ఉన్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు విజయశాంతి గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అడపాదడపా కాంగ్రెస్ తరపున నిర్వహించే కార్యక్రమాల్లో హాజరవుతున్నప్పటికీ రాములమ్మ వివాదాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో తన పేరు లేకపోవడం వల్ల విజయశాంతి అలకబూనారన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో రాములమ్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారి తీశాయి. లాల్‌దర్వాజా బోనాల పండగ సందర్భంగా విజయశాంతి చేసిన కామెంట్స్‌పై రచ్చ మొదలైంది. ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఇప్పుడు జైతెలంగాణ అనే మాటను ఉచ్ఛరించే నేతలు తక్కువయ్యారంటూ రాములమ్మ చేసిన కామెంట్స్‌పై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ప్రజలు పరస్పరం పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ వంటి ఇంగ్లీష్ మాటలకు బదులు జైతెలంగాణ అని పలకాలని విజయశాంతి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవం, గుర్తింపు, ఉద్యమం పునాదులపై.. ఈ నినాదం నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణను మళ్లీ దోచే ప్రయత్నాలు జరుగుతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారికి వినాశనం తప్పదని హెచ్చరించారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ నినాదం, తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం తగ్గుతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్‌కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని రాష్ట్ర విభజన జరగకూడదని రేవంత్ కోరుకున్నారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఇలా రేవంత్‌ను తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఇరికించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్న తరుణంలో రాములమ్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
గత కొన్ని రోజులుగా కొంత మంది కాంగ్రెస్ నేతలు జైతెలంగాణ నినాదాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన వేడుకల్లో.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు… జై తెలంగాణ ఒక సాధారణ నినాదం కాదన్నారు. అది ప్రతి తెలంగాణవాసి గుండెల్లో ఉండే ఓ భావోద్వేగమన్నారు. జైతెలంగాణ నినాదం.. మన ఉనికి, మన గౌరవం అని స్పష్టం చేశారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకల్లోనూ కొంతమంది నాయకులు, సినీ నటులు జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర గర్వాన్ని ప్రతిబింబించే జైతెలంగాణ నినాదాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రోత్సహించాలని విజయశాంతి పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఏ సభ జరిగినా జైతెలంగాణ నినాదం చేసేవారు. కానీ రేవంత్ సీఎం అయిన తర్వాత జైతెలంగాణ అనే ఊసే ఎక్కడా వినిపించకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ అంశాన్ని వాడుకుని సీఎం రేవంత్ రెడ్డి వీక్ పాయింట్‌పై దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి గూగ్లీ బాల్స్ వేయడం రాజకీయాలను వేడెక్కించింది.
వ్యక్తిగత విషయాలపై నిలదీస్తే అది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది కానీ జైతెలంగాణ నినాదాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించడం ద్వారా ఉద్యమకారుల మద్దతు తనకు లభించాలన్నదే రాములమ్మ వ్యూహంగా కనిపిస్తోంది. అదును చూసి విజయశాంతి సంధించిన అస్త్రంతో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడే పరిస్ధితి తలెత్తింది.
మొత్తానికి జైతెలంగాణ నినాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఎవరినుద్దేశించి వ్యాఖ్యలు చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.