Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ విజయసాయి రాజీనామా

Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి.. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. అ యితే ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఈ నెల 31న జగన్ లండన్ నుంచి వచ్చాక.. విజయసాయి రాజీనామాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి విజయసాయి రెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది.
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి.. అన్ని లెక్కలు వేసుకున్నాకే రాజకీయంగానూ నిర్ణయాలు తీసుకుంటారు. క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయ సాయి.. పనిలో పనిగా తనకు జనసేనాని పవన్ కళ్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్నాయని, ఏపీ సీఎం చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదంటూ ముక్తాయించడం కొసమెరుపు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఊపందుకున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలకంగా మారుతుందన్న వాదన ఒకవైపు.. కేంద్రంలో బీజేపీతో సంబంధాలను కొనసాగించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న ప్రచారం మరోవైపు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ.. రాజ్యసభ పదవిని వదులుకోవడానికి అసలు కారణం… విజయసాయి రెడ్డి.. రాజ్‌భవన్‌కు వెళ్లి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవ్వాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మారుతున్న రాజకీయ సమీకరణాలను సునిశితంగా విశ్లేషించిన విజయసాయిరెడ్డి.. వైసీపీలో కొనసాగడం వల్ల తనకు పెద్దగా భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో గత రెండేళ్లుగా విజయసాయిరెడ్డి రగిలి పోతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం తర్వాత బీజేపీలో చేరేందుకు విజయసాయి పెద్ద స్కెచ్ వేశారని వైసీపీ నేతలు చెప్తున్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనాచౌదరి.. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరి, టీడీపీకి పరోక్షంగా సహకరించారు.
సేమ్ అదే తరహాలో తాను కూడా కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతుతో బీజేపీలో చేరి.. జగన్‌కు పరోక్షంగా సపోర్ట్ చేస్తానని వైసీపీ అధిష్టానం వద్ద విజయసాయి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రపోజల్ పై జగన్ సీరియస్ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి జగన్‌తో గ్యాప్ పెరిగిందని, దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి, తనతో టచ్ లో ఉన్న కొందర్ని బీజేపీ గూటికి చేర్చి.. తనదారి తాను చూసుకోవాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారని టాక్.
ఇక గతంలో తన భవిష్యత్ గురించి విజయసాయి విశ్లేషిస్తూ.. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ కావాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రపోజల్‌ను బీజేపీ హైకమాండ్ ముందు ఉంచారని.. దానికి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే.. రాజ్యసభ పదవిని విజయసాయి రెడ్డి వదులుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.