అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్

అమెరికా, ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తమ సైనిక విభాగాలన్నీ కాల్పులు నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇది యుద్ధం ముగింపు కాదని, చర్చల కోసం ఇస్తున్న తాత్కాలిక విరామం మాత్రమేనని టెహ్రాన్ స్పష్టం చేసింది.
కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్చరించింది. శత్రువు చిన్న తప్పు చేసినా పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 28న యూఎస్-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధ లక్ష్యాలను దాదాపుగా సాధించామని, శత్రువును చారిత్రక ఓటమి అంచున నిలబెట్టామని ఇరాన్ ప్రకటించింది.
చర్చల కోసం ఇరాన్ 10 సూత్రాలతో కూడిన ప్రతిపాదనను అమెరికా ముందుంచింది. హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యం, ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల నుంచి బలగాల ఉపసంహరణ, తమకు జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడం, అన్ని ఆంక్షలను ఎత్తివేయడం వంటివి ఈ ప్రతిపాదనలోని కీలక అంశాలు. ఈ నెల 10న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.
మరోవైపు, పాకిస్థాన్ ప్రతిపాదనను అంగీకరించి, కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదన చర్చలకు ఆమోదయోగ్యమైన ప్రాతిపదిక అని ఆయన అన్నారు. అయితే, హర్మూజ్ జలసంధిని తక్షణమే, సురక్షితంగా వాణిజ్యానికి తెరవాలనే షరతుకు ఇరాన్ అంగీకరించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. మరోపక్క.. చర్చలు ఫలించి, తమ డిమాండ్లు నెరవేరితేనే శాశ్వత శాంతి ఉంటుందని, లేదంటే పోరాటం కొనసాగుతుందని ఇరాన్ తేల్చిచెప్పింది.



