వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా

అమెరికా ప్రభుత్వం వీసాల విషయంలో మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల వార్షిక ఫీజులను భారీగా పెంచిన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 2,805 డాలర్లుగా ఉన్న ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును 2,965 డాలర్లకు పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. ఈ కొత్త ఫీజులు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నమోదైన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ పెంపు చేసినట్లు USCIS తెలిపింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి వసూలు చేసే ఈ ప్రీమియం ఫీజులు పెరగడం వల్ల భారతీయులు సహా విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులపై భారం పడనుంది.
హెచ్-1బీ, ఎల్-1, ఒ-1, పీ-1, టీఎన్ వీసాలకు సంబంధించిన ఫారం I-129 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే ఎఫ్-1, జే-1 వంటి వీసాలకు సంబంధించిన ఫారం I-539 ఫీజును 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెంచారు. ఇక హెచ్-2బీ, ఆర్-1 వీసాల ఫారం I-129 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.



