US: H-1B ఫీజును లక్ష డాలర్లుగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన లక్ష డాలర్ల H-1B వీసా ఫీజు రుసుముపై నెలరోజుల గందరగోళానికి తెరపడింది. భారతీయులతో సహా అమెరికాలో ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు ఇది పెద్ద ఊరటని చెప్పాల్సి ఉంటుంది. లక్ష డాలర్ల ఫీజు బయట దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారికి మాత్రమే అప్లై అవుతోందని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇవాళ స్పష్టం చేసింది. ఐతే ఈ ఫీజు అమెరికాలో ఉంటూ, వీసా స్థితిని మార్చుకునే వారికి వర్తించదని స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో అమెరికాలో చదువుకుంటున్న మనోళ్లకు ఉపశమనమని చెప్పొచ్చు. సెప్టెంబర్ 19న ట్రంప్ సర్కారు ప్రకటించిన భారీ ఫీజు కంపెనీల యజమానులనూ, వీసాదారులనూ షాక్‌కు గురిచేసింది.
H-1B వీసాపై కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రతి ఉద్యోగి లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాలన్న నిర్ణయం, అసలుకే ఇబ్బందిగా ఉన్న ఐటీ పరిశ్రమను కంగారు పెట్టింది. అమెరికాలోని టెక్, ఇంజనీరింగ్ రంగాల్లో కలవరం రేపింది. అయితే, తాజాగా అమెరికా అధికారులు రిలీజ్ చేసిన మార్గదర్శకాలు మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇస్తున్నాయి. అమెరికా విడిచి వెళ్లకుండానే వీసా స్థితిని మార్చుకునే వారు, ఉదాహరణకు F-1 విద్యార్థి నుంచి H-1B స్థితికి మారేవారు, తాజాగా ట్రంప్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష డాలర్ల ఫీజు కట్టాల్సిన పనిలేదు.
అమెరికా చట్టం ఎవరికి వర్తిస్తుందంటే.. అమెరికా బయట ఉన్న కొత్త H-1B అభ్యర్థులకు, ప్రభుత్వ నిర్ణయం రాకముందే అమెరికా విడిచి వెళ్లాల్సిన వారికి వర్తిస్తుంది. ఐతే, ఇప్పటికే అమెరికాలో F-1, లేదా L-1 వీసాపై ఉన్నవారు దీనికి వర్తించదు. అమెరికాలో ఉండి H-1B స్థితికి మారాలనుకున్న గ్రాడ్యుయేట్లకు ఇది అడ్వాంటేజ్ అని చెప్పాలి. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ USCIS ప్రకారం, సెప్టెంబర్ 21, 2025 అర్ధరాత్రి 12 గంటల తర్వాత, అమెరికా బయట దేశాల్లో ఉన్న వారు మాత్రమే ఈ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది భారతీయ విద్యార్థులకు లైఫ్‌లైన్ అని చెప్పొచ్చు. ఈ మార్గదర్శకం ప్రత్యేకంగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఊరట.
ఎందుకంటే, వారు ఎక్కువగా F-1 వీసాపై చదువులు పూర్తి చేసుకుని H-1B వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టతతో లక్ష డాలర్ల అదనపు భారాన్ని మనవాళ్లు తప్పించుకోవచ్చు. L-1 వీసాపై ఉన్న ఉద్యోగులు కూడా ఇది ఉపశమనమే. L-1 వీసా అనేది బహుళజాతి కంపెనీలు తమ విదేశీ కార్యాలయాల నుండి అమెరికా కార్యాలయాలకు సిబ్బందిని బదిలీ చేయడానికి ఉపయోగించే వలసేతర వీసా. తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ నిర్ణయంతో టెక్ రంగం ఊపిరి పీల్చుకుంది. ట్రంప్ నిర్ణయంపై టెక్ రంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ రుసుము అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని పలువురు ఇండస్ట్రీ నేతలు పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని నివారించడమే ఉద్దేశమని ట్రంప్ పరిపాలన చెబుతున్నా, అమెరికన్ కంపెనీలు ఎదుర్కొంటున్న నైపుణ్య లోటు సమస్యను ఇది మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరించారు. ఐతే ఇంకా మొత్తం వ్యవహారంపై ఎన్నో డౌట్స్ కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం కొత్త పిటిషన్‌లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పినప్పటికీ, ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వృత్తుల వారీగా ఎవరైనా మినహాయింపులు పొందగలరా అన్నది తేలాల్సి ఉంది.
ప్రత్యేక పరిశ్రమలకు సడలింపులు ఉంటాయా, లేదా అన్నది తేలాలి. ఇమ్మిగ్రేషన్ డిపార్మెంట్ తాత్కాలికంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రుసుము చెల్లింపు విధానం ప్రారంభించినా, చట్టపరమైన సవాళ్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ట్రంప్ పరిపాలన ప్రకటించిన లక్ష డాలర్లు H-1B వీసా ఫీజు, విదేశీ కార్మికులపై కఠినతరమైన చర్యగా నిలిచినా అమెరికాలో ఉన్న విద్యార్థులు, భారతీయ టెక్ ఉద్యోగులకు ఇది ఇక వర్తించదు. అంటే, ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి ఇది ఓ ఊరట. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం కొత్త పరీక్ష.



