బీఎస్ఈలోకి యూనిప్రో టెక్నాలజీస్ రీఎంట్రీ!

Unipro Technologies | హైదరాబాద్‌కు చెందిన ఐటీ సంస్థల్లో ఒకటైన యూనిప్రో టెక్నాలజీస్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లో మళ్లీ లిస్టయ్యింది. ఉప్పల్ లోని యూనిప్రో సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ రీఎంట్రీ కార్యక్రమంలో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నొవేషన్ ఆధారిత అభివృద్ధి పై యూనిప్రో దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించింది.
యూనిప్రో మేనేజింగ్ డైరెక్టర్ దండు వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఈఓ పృథ్విరాజ్ తడకమల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దండు అపర్ణ రెడ్డి, కేబీకే గ్రూప్ చైర్మన్ కక్కిరేణి భరత్ కుమార్, డిజిటల్ కనెక్ట్ సీఈవో నిఖిల్ గుండా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం లిస్టింగ్ మాత్రమే కాదనీ, యూనిప్రో ప్రయాణంలో ఒక సరికొత్త ఆరంభమని తెలిపారు. ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నొవేషన్ ఆధారిత నూతన ఆవిష్కరణలతో మిళితం చేస్తూ, దేశానికి, పెట్టుబడిదారులకు విలువ చేకూర్చే దిశగా ప్రయాణించబోతున్నామన్నారు.
కేబీకే గ్రూప్ చైర్మన్ డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ మాట్లాడుతూ యూనిప్రో తిరిగి బీఎస్‌ఈలో లిస్ట్ అవడం, సంస్థ దృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. యూనిప్రో సీఈవో పుడ్వి రాజ్ తడకమల్ల మాట్లాడుతూ బీఎస్ఈలో యూనిప్రో రీ-లిస్టింగ్ తమ సంస్థకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు.
సంస్థ 2026 నాటికి హైదరాబాద్‌లో ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్ స్థాపించనున్నట్లు తెలిపారు. అలాగే ఆటోమేషన్ టూల్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, సైబర్‌సెక్యూరిటీ, స్మార్ట్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లపై రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.
1985లో స్థాపితమైన యూనిప్రో ఐటీ సేవల సంస్థగా ప్రారంభమై, ఇప్పుడు ఐటీతోపాటు ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధారిత సంస్థగా రూపాంతరం చెందింది. ఈ రీ లిస్టింగ్ ద్వారా సంస్థ తన సుదీర్ఘ వారసత్వాన్ని, నూతన దృక్పథాన్ని మార్కెట్‌కు మరోసారి చాటిచెప్పింది.



