అంతర్జాతీయం

సిరియాపై ఇజ్రాయేల్ భీకర దాడి.. భూకంపం కంటే 2 రెట్ల వేగంతోప్రకంపనలు!

పశ్చిమాసియా దేశం సిరియాలో 12 ఏళ్లుగా కొనసాగుతోన్న అంతర్యుద్ధం గతవారం ముగిసింది. రెబల్స్ సైన్యం.. రాజధాని డమాస్కస్ నగరంలోకి ప్రవేశించడంతో అధ్యక్షు బషర్ అల్ అసద్ దేశం విడిచి కుటుంబంతో సహా పారిపోయాడు. దీంతో 54 ఏళ్లు పాటు కొనసాగిన అసద్ కుటుంబ నియంత పాలన ముగిసింది. సిరియన్లు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నారు. అయితే, పొరుగున ఉన్న ఇజ్రాయేల్ మాత్రం.. ఆ దేశంపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా, ఆదివారం రాత్రి ఇజ్రాయేల్ జరిపిన దాడి గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.

తమ సరిహద్దుల్లోని సిరియా తీరప్రాంతంపై ఇజ్రాయేల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. అత్యంత కీలక పోర్టు సిటి టార్టస్ నగరంపై ఆదివారం రాత్రి శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడి తీవ్రతకు భూకంపం వచ్చినట్టు భూమి కంపించిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రత నమోదయ్యిందంటే తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. యుద్ధాలను ట్రాక్‌ చేసే ‘ఓఎస్‌ఐఎన్‌టీ డిఫెండర్‌’ ఈ విషయాన్ని గుర్తించింది. దీని తీవ్రత దాడి చేసిన ప్రదేశానికి 820 కి.మీ. దూరంలోని పశ్చిమ తుర్కియే సిటీ ఇస్నిక్‌లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు యూకేకు చెందిన డెయిలీ మెయిల్‌ పత్రిక నివేదించింది. భూకంపం కంటే రెండు రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు ప్రముఖ పరిశోధకుడు రిచర్డ్‌ కోర్డారో తెలిపారు.

సిరియాపై 2012 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యాధునిక ఆయుధాలతో జరిపిన దాడి తీవ్రతకు వెలువడిన అగ్నికీలలు కొన్ని కిలోమీటర్ల మేర కనిపించాయి. ఆ తర్వాత అక్కడి నుంచే పలుసార్లు పేలుడు శబ్ధాలు వినిపించాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ఇజ్రాయేల్ క్షిపణులను ప్రయోగించినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేర్కొంది. దాడి జరిగిన నగరంలో రష్యా నౌకాదళానికి చెందిన ఆయుధ డిపోలీలు భారీగా ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌గా ఉన్నప్పుడు 1971లో ఈ నగరంలో నౌకాదళ స్థావరాన్ని మొదటిసారి నిర్మించారు.

మధ్యదరా సముద్రంలో రష్యా నౌకల ప్రవేశానికి ఇదే ఏకైక మార్గం. సిరియా అంతర్యుద్ధంలో బషర్‌ అల్ అసద్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఈ స్థావరం గుండానే ఆయుధాలను రష్యా సరఫరా చేసేది. దాదాపు 250 కి.మీ. దూరం నుంచి ముప్పును పసిగట్టే గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసిన ఈ నగరాన్ని 2017లో రష్యాకు 49 ఏళ్ల పాటు ఉచితంగా బషర్ లీజుకు ఇచ్చారు. గతవారం తిరుగుబాటుదళాలు సిరియాను స్వాధీనం చేసుకోవడంతో బషర్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో రెబల్స్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతుండటంతో స్థావరాన్ని రష్యా ఖాళీచేస్తోంది. ఇక్కడ ఉన్న ఐదు రష్యా యుద్ధనౌకలు వెనక్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button