పరకామణి చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు..టీటీడీ బోర్డు నిర్ణయం

తిరుమల పరకామణిలో చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. పాత ఫిర్యాదు విచారణకు వస్తే అసలు కుట్రలోని చాలా అంశాలు బయటపడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ మొత్తం కుట్రను బయటపెట్టేందుకు మరో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు. లోక్ అదాలత్ లో జరిగిన రాజీని రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని నిశ్చయించారు. పరకామణిలో 900 యూఎస్ డాలర్లను దొంగలించిన వ్యక్తి రాజీ కోసం టీటీడీకి ఏకంగా రూ.14.50 కోట్ల విలువైన ఆస్తులను ఎలా ఇచ్చారని బోర్డు విస్మయం వ్యక్తం చేసింది.
అసలు లోక్ అదాలత్లో ఎవరి ప్రమేయంతో ఈ రాజీ జరిగింది. ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు. రాజీకి దారి తీసిన కారణాలేమిటో మరోసారి లోతైన దర్యాప్తు జరిపించాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ఏవీఎస్వి సతీష్ కుమార్ మరణంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. దీని వెనుక కుట్ర బయట పడాలంటే టీటీడీ కూడా క్రిమినల్ ఫిర్యాదు చేయడమే మార్గమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు . గతంలో జరిగిన దొంగతనాలు, నిధుల దుర్వినియోగం, కుట్రలను వెలికితీయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, బోర్డు సభ్యులు ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉంటే దర్యాప్తు చేయించాలని బోర్డు తీర్మానించింది.



